
నేడు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక మహాధర్నా
సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో.. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద బుధవారం మహాధర్నా జరుగనుంది. ఈ మహాధర్నాకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు చెప్పారు. సమైక్యవాదం బలమెంతో చాటి చెప్పేందుకే ‘చలో హైదరాబాద్’ ధర్నాను నిర్వహిస్తున్నామని.. అసెంబ్లీ ముట్టడి తమ అజెండాలో లేదని చెప్పారు. మంగళవార ం ఏపీఎన్జీవో భవన్‌లో అశోక్‌బాబు విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో విభజన బిల్లుకు వ్యతిరేకంగా గళమెత్తిన ప్రజాప్రతినిధులకు మద్దతుగానే మహాధర్నా జరగనుందని చెప్పారు. గతంలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ సందర్భంగా జరిగిన దాడుల నేపథ్యంలో... ఈ ధర్నాను ఉదయం 11కు ప్రారంభించి, సాయంత్రం 4 గంటలకు ముగిస్తామన్నారు. సమైక్యవాదులపై దాడులు జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. అసెంబ్లీలో ఓటింగ్ పెట్టించి, విభజన బిల్లును ఓడించాలని ప్రజాప్రతినిధులను కోరారు. ఉద్యోగులతో పాటు అన్నివర్గాలవారు ఈ ధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
‘చలో హైదరాబాద్’కు షరతులతో అనుమతి
సాక్షి, హైదరాబాద్: ఏపీ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక తరఫున ఏపీఎన్జీఓలు బుధవారం నిర్వహించ తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి పోలీసులు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు. హైదరాబాద్ మధ్య మండల డీసీపీ కమలాసన్‌రెడ్డి 15 షరతులను స్పష్టం చేసి, వాటిని కచ్చితంగా పాటిస్తామంటూ ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబు నుంచి లిఖితపూర్వక హామీ తీసుకున్నారు. కార్యక్రమాన్ని బుధవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించుకోవాలని, అసెంబ్లీ వైపు ఎవరూ వెళ్లరాదన్నవి ప్రధాన నిబంధనలు. పోలీసులు విధించిన షరతులివీ...
నగరంలో శాంతి భద్రతలు సహా ఎలాంటి ఇతర అవాంఛనీయ పరిణామం తలెత్తినా ఎలాంటి నోటీసు లేకుండా తక్షణమే అనుమతి రద్దవుతుంది.
సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు మేరకు ధర్నా సమయంలో వాటిల్లే ఆస్తి నష్టానికి, తలెత్తే అవాంఛనీయ సంఘటనలకు నిర్వాహకులే బాధ్యత వహించాలి.
ధర్నాకు వచ్చే, వెళ్లే సమయంలో నిర్వాహకులు, పాల్గొన్న వారితో సహా ఎవ్వరూ ర్యాలీలు నిర్వహించడం, నినాదాలు చేయడం కూడదు.
ప్రసంగాలు ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా ఉండకూడదు.
ధర్నాలో పాల్గొనేవారు అనుమతించిన ప్రదేశం దాటి బయటకు వెళ్లకూడదు.
ధర్నా వేదిక వద్ద రెండు బాక్సు తరహా స్పీకర్లు మాత్రమే వినియోగించాలి.
ధర్నా ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న, ఇతర ప్రాంతాల్లోని రోడ్లపై ఎలాంటి నిరసనలు చేపట్టకూడదు. ఇందిరాపార్క్ వద్ద నిరసన తెలుపుతున్న ఇతరులకు ఇబ్బందులు కలిగించరాదు.
విధ్వంసానికి పాల్పడతారనే అనుమానం ఉన్నవారెవరినీ నిర్వాహకులు తమతో చేరడానికి అంగీకరించకూడదు.
పదివేలకు మించరని వారే చెప్పారు: ‘చలో హైదరాబాద్’ నిర్వహణపై కొన్ని అనుమానాలుండటంతో నిర్వాహకుల నుంచి లిఖితపూర్వక హామీ తీసుకుని, షరతులతో కూడిన అనుమతి ఇచ్చాం. లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలో ధర్నాలో పాల్గొనేవారు పదివేలకు మించరని వారే చెప్పారు. - వీబీ కమలాసన్‌రెడ్డి, మధ్య మండల డీసీపీ