జన్మభూమి -మావూరు మళ్లీ మొదలవుతోంది. గతేడాది అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అందిన అర్జీలకు నేటికీ అతిగతిలేదు.
నేటి నుంచి రెండో విడత జన్మభూమి- మావూరు
డ్వాక్రాసంఘాల పొదుపు ఖాతాలకు రూ.3వేల జమ
కొత్త పింఛన్ల పంపిణీకి చర్యలు
సాక్షి, విశాఖపట్నం : జన్మభూమి -మావూరు మళ్లీ మొదలవుతోంది. గతేడాది అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అందిన అర్జీలకు నేటికీ అతిగతిలేదు. మళ్లీ మరోసారి ఈ జాతర ప్రారంభ మవుతోంది. ఒక వైపు రుణమాఫీ వర్తించని రైతులు, మాఫీ పేరుతో మోసపోయిన డ్వాక్రా మహిళలు, తొలిగించిన పింఛన్, రేషన్‌కార్డుదారుల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏడాదిగా నాన్చుతూ ఎట్టకేలకు డ్వాక్రా సంఘాలకు ఆర్థిక పరిపుష్టి పేరిట రూ.3వేలు జమకు ఈ గ్రామసభలను వేదికగా చేసుకుంటున్నారు.
దాదాపు మూడో వంతు సంఘాలకు ఒక్కోదానికి రూ.2 నుంచి 5లక్షల వరకు వడ్డీతో కలిపి అప్పులు పేరుకుపోయాయి. అలాంటిది సంఘానికి రూ.10వేల చొప్పున రివాల్వింగ్ పండ్ జమ చేస్తామని చెప్పిన సర్కార్ చివరకు మొడటి విడతగా రూ.3వేల చొప్పున వారి పొదుపు ఖాతాలో జమకు సిద్ధమైంది. తొలుత జిల్లాకు రూ.213 కోట్లు మంజూరు చేశామని చెప్పిన ప్రభుత్వం చివరకు ఆ మొత్తాన్ని రూ.187 కోట్లకు కుదించింది.
అలాగే అమలులో ఏడాది జాప్యం జరిగినందున వడ్డీ రాయితీ ఇస్తున్నట్టుగా చెప్పుకొచ్చిన పాలకులు చివరకు ఆ వడ్డీలో కూడా భారీగానే కోతపెడుతున్నారు. రూ.65కోట్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం రూ.44కోట్లు మాత్రమే విడుదల చేసింది. అసలే రుణమాపీ అమలుకాకపోవడంతో మంచికాకమీద ఉన్న డ్వాక్రా సంఘాలు ఈ గ్రామ సభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులను నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి.
మరొక పక్క రుణమాఫీ మాయలో పడిఅప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతుల నుంచి ఇప్పటికే 40వేలకు పైగా అర్జీలందాయి. అతీ గతి లేని వీటి పరిస్థితిపై నిలదీసేందుకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. గతేడాది నిర్వహించిన జన్మభూమి మావూరులో ఏకంగా 3.54లక్షల అర్జీలు రాగా, అధికారుల పరిశీలన తర్వాత వాటిలో అర్హమైనవంటూ లక్షా 92 వేల 202 అర్జీలను అప్‌లోడ్ చేశారు. వీటిలో అత్యధికంగా గృహరుణాలకోసం 48,224 మందిదరఖాస్తు చేసుకోగా, ఆ తర్వాత రేషన్‌కార్డుల కోసం 39,541 దరఖాస్తులొచ్చాయి.
ఇంటి స్థలాలు..ఇతర రెవెన్యూ సమస్యల కోసం 32,791, కొత్త పింఛన్ల కోసం 30,231 అర్జీలొచ్చాయి. వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య శాఖ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్, ఉపాధి, గ్రామీణ నీటి సరఫరా తదితర 28 శాఖలకు చెందిన వేలాది అర్జీలు అప్‌లోడ్ చేశారు. ఇది చేపట్టి ఎనిమిదినెలలు గడుస్తున్నా వీటిలో ఏ ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోలేదు.
పింఛన్ల కోసం జన్మభూమి మావూరుతో పాటు మండల, జిల్లా స్థాయి గ్రీవెన్స్‌లో అందిన దరఖాస్తులన్నీ పరిశీలించి పార్టీలకతీతంగా 44వేల మంది అర్హులుగా అధికారులు తేల్చారు. కానీ జన్మభూమి కమిటీలు మాత్రం వాటిలో 20వేల మందికి కోత పెట్టి కేవలం 24వేల మందికి మాత్రమే సిఫారసు చేశారు. వీటిలో 12.500 పింఛన్లకు మాత్రమే సర్కార్ ఆమోదముద్రవేసింది. వీటిని కూడా తొలగించిన వాటి స్థానంలోనే కొత్తగా మంజూరు చేసినట్టుగా గొప్పలు చెప్పుకుంటూ నేటినుంచి పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు.