కృష్ణా: పాఠశాలకు వెళ్లిన చిన్నారిని మృత్యువు మోటారు సైకిల్ రూపంలో బలి తీసుకున్న సంఘటన కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంలో శనివారం జరిగింది. ఎస్‌ఐ లవరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చినగొల్లపాలెం రాళ్లరేవుకు చెందిన పెద్ది బాలాజి కుమారుడు మణికంఠ(6) లక్ష్మీపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. శనివారం తన సోదరుడితో కలసి పాఠశాలకు వచ్చాడు. స్కూలు ముగిసిన అనంతరం స్కూలు వ్యాన్ ఎక్కడం మరిచిపోయాడు. దీంతో పాఠశాల యాజమాన్యం తమ సిబ్బందితో మోటారు సైకిల్ మీద మణికంఠ, అతని సోదరుడిని వ్యాన్ వద్దకు పంపించారు. వీరు ప్రయాణిస్తున్న మోటార్‌సైకిల్ ప్రమాదవశాత్తు ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీకొట్టింది. ఈసమయంలో రోడ్డుపై వెళుతున్న ట్రాక్టరు చక్రానికి మణికంఠ గుద్దుకుని తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే పాఠశాల యాజమాన్యం ఘటనా స్థలికి చేరుకుని మణికంఠను భీమవరంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో 108 సిబ్బంది మణికంఠను పరీక్షించి మృతిచెందాడని నిర్ధారించారు.
దీంతో మణికంఠ మృతదేహాన్ని తీసుకుని వెనుకకు వచ్చేశారు. ఈ ఘటనపై అందిన సమాచారం మేరకు పోలీసులు వచ్చి ట్రాక్టర్, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఎస్సై లవరాజు తెలిపారు. మణికంఠ మృతదేహం వద్ద తల్లి, కుటుంబసభ్యులు విలపిస్తున్న తీరు చూపరులను కంట తడి పెట్టించింది.