విద్యుత్ స్తంభాలను తీసుకెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.
అనుమసముద్రంపేట, న్యూస్‌లైన్: విద్యుత్ స్తంభాలను తీసుకెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మండలంలోని చిన్నఅబ్బీపురం వద్ద శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటనలో ఇదే మండల పరిధిలోని అబ్బాసాహెబ్‌పేటకు చెందిన వల్లూరు వెంగయ్య (27), కొత్తపేట నివాసి పీతల కొండలరావు (30) ప్రాణాలు విడిచారు.
స్థానికులు, పోలీసుల కథనం మేరకు..గుడిపాడు పంచాయతీ మజరా అబ్బాసాహెబ్‌పేటకు చెందిన వల్లూరు వెంగయ్య అనే రైతు తన పొలంలోని మోటార్‌కు విద్యుత్ స్తంభాలు తీసుకొచ్చేందుకు మండలంలోని కొత్తపేటకి చెందిన కొండలరావు, కోలా మస్తాన్, కోలా చిన్నకొండయ్య, కోలా మల్యాద్రి అనే కూలీలను వెంటబెట్టుకుని తన గ్రామవాసైన వల్లూరు వెంకట్రావు ట్రాక్టర్‌లో వెళ్లారు. అనుమసముద్రం వద్ద నాలుగు విద్యుత్ స్తంభాలను ట్రాక్టర్‌లోకి ఎక్కించారు. అబ్బాసాహెబ్‌పేటకు వస్తూ మార్గమధ్యంలో చిన్నఅబ్బీపురం బస్టాండ్ దాటిన తర్వాత వేగంగా వెళుతున్న ట్రాక్టర్ అదుపుతప్పింది.
గొల్లెం ఊడి ట్రక్కు బోల్తాపడింది. ట్రక్కులో స్తంభాలపై కూర్చున్న నలుగురు కూలీల్లో మస్తాన్, చిన్నకొండయ్య, మాల్యాద్రి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. వల్లూరు వెంగయ్య, కొండలరావులపై స్తంభాలు పడటంతో అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు. మృతదేహాలను గ్రామస్తులు రాత్రికే రాత్రే ఊరికి తరలించారు. సంఘటన స్థలానికి ఎస్‌ఐ శ్రీనివాసులురెడ్డి శనివారం వెళ్లి పరిశీలించారు. స్తంభాలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారనే విషయమై విచారిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాలకు శవపంచనామా నిర్వహిస్తామన్నారు.
విషాదఛాయలు
మృతుల గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వల్లూరు వెంగయ్యకు మూడేళ్ల క్రితమే సుశీలతో వివాహమైంది. తనకిక దిక్కెవరిని సుశీల చేస్తున్న రోదన చూపరులను కంటితడి పెట్టించింది. కొత్తపేటకు చెందిన కొండలరావుకు భార్య, కుమారుడు మనోహర్, కుమార్తె మమత ఉన్నారు.