
వెలగలేరు (జి.కొండూరు) : అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం అధికారులు చేసే హడావుడి చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు. వెలగలేరులో ఆదివారం ఇంటింటికి తెలుగదేశం కార్యక్రమంలో భాగంగా జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హాజరవ్వడంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ట్రాఫిక్ నిలిపివేశారు. దీంతో జి.కొండూరు నుంచి కొండపల్లి ఐడీఏ, జి.కొండూరు నుంచి చెవుటూరు, వెలగలేరు నుంచి కొత్తూరు తాడేపల్లి వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ఇటీవల విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం వద్ద ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా ఇబ్రహీంపట్నం నుంచి జి.కొండూరు, వెలగలేరు మీదుగా ట్రాఫిక్ మళ్లింపు తెలిసిన విషయమే అయినప్పటకీ పోలీసులుప్రత్యామ్నాయ మార్గం చూపకుండా ఆంక్షలు పెట్టడంతో వాహనాలు నిలిపోయాయి. ఒక పార్టీ కార్యక్రమం కోసం గంటల కొద్దీ వాహనాలను నిలిపివేయడం, ప్రయాణి కులను ఇబ్బందులు పెట్టడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.