
రొంపిచర్ల నూతన రైల్వే స్టేషన్ కు వచ్చిన రైలు
పిడుగురాళ్ల: నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే పనులు తొలిదశ పూర్తి కావడంతో గురువారం న్యూ పిడుగురాళ్ల రైల్వేస్టేషన్ నుంచి రైలు ప్రయాణం ప్రారంభించారు. మొదటి దశ పనులు న్యూ పిడుగురాళ్ల స్టేషన్ నుంచి శావల్యాపురం వరకు 45.85 కిలోమీటర్లు పూర్తి కావడంతో ట్రయల్ రన్ నిర్వహించారు. సుమారు 120 కిలోమీటర్ల వేగంతో అతివేగంగా వెళ్లే మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే ì రైల్వే జనరల్ మేనేజర్ అమిత్ గోయల్, డెప్యూటీ చీఫ్ మేనేజర్ రామ్ క్రిపాల్ హాజరయ్యారు. ముందుగా న్యూ పిడుగురాళ్ల స్టేషన్ నుంచి రామ్ క్రిపాల్ పచ్చజెండా ఊపి రైలును ప్రారంభించారు. ముందుగా పిడుగురాళ్ల పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో రైల్వే జనరల్ మేనేజర్ అమిత్ గోయల్, గుంటూరు రైల్వే రీజనల్ మేనేజర్ రాజుతో పాటు రైల్వే అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తి–నడికుడి రైల్వే మార్గంలో ప్రారంభమవుతున్న రైలు ప్రయాణం విజయవంతం కావాలని పూజలు చేశారు.
దేవస్థానం అధ్యక్షుడు కోదండరామయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకులు కొత్త లక్ష్మీనారాయణ, ఆలయ కమిటీ నిర్వాహకులు రైల్వే అధికారులకు స్వాగతం పలికారు. నడికుడి–శ్రీకాళహస్తి మొదటి దశ పనులు పూర్తి కావడంతో రైలును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిడుగురాళ్ల నుంచి శావల్యాపురం వరకు సుమారు రూ.600 కోట్ల వ్యయంతో 45.85 కిలోమీటర్లు రైల్వే లైన్ పూర్తయిందన్నారు. ఎక్కువ వేగంతో ఈ రైలు వెళుతుందని తెలిపారు. రైలు వెళ్లే మార్గంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమస్య ఉంటే రైల్వే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. న్యూ పిడుగురాళ్ల రైల్వేస్టేషన్ నుంచి రొంపిచర్ల వరకు గురువారం ఈ రైలు నడపబడుతుందని, శుక్రవారం రొంపిచర్ల నుంచి శావల్యాపురం వరకు నడుపుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గుంటూరు రైల్వే రీజనల్ మేనేజర్ రాజా, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
రొంపిచర్లకు రైలు వచ్చింది
రొంపిచర్ల: మండలంలో నూతనంగా నిర్మాణమైన రైల్వే ట్రాక్‌పై గురువారం రైలు స్పీడ్‌రన్ నిర్వహించింది. ముందుగానే రైలు వస్తుందన్న సమాచారం గ్రామస్తులకు తెలియటంతో రైలును చూసేందుకు రైలు మార్గం చుట్టుపక్కలున్న గ్రామస్తులు ఆసక్తి చూపారు. మండలంలో ఏర్పాటు చేసిన ఏకైక రైల్వేస్టేషన్ రొంపిచర్ల కావటంతో ప్రజలు రైల్వే స్టేషన్ చేరుకున్నారు. ఎక్కువ మంది యువకులు, విద్యార్థులు రైల్వే స్టేషన్‌కు వచ్చి స్టేషన్‌కు వచ్చిన రైలులో ఎక్కి దిగడం, సెల్ఫీలు తీసుకోవడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైను నిర్మాణంలో భాగంగా మొదటి దశలో పిడుగురాళ్ల నుంచి శావల్యాపురం వరకు నిర్మాణం పూర్తయింది. పిడిగురాళ్ల నుంచి బయలు దేరిన రైలు రొంపిచర్లకు సాయంత్రానికి చేరుకుంది. రైలును వీక్షించేదుకు వచ్చిన ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా రైల్వే అధికారులు ఏర్పాట్లు, భద్రతా చర్యలు చేపట్టారు. 40 సంవత్సరాలుగా రైల్వే లైను ఏర్పాటవుతుందని ఎదురు చూస్తున్న ఈ ప్రాంత వాసుల కల నేరవేరింది. రైలు రావటం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైలు సౌకర్యం రావడం ఎంతో మంచి పరిణామమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment