
విద్యుత్ శాఖలో బదిలీల ఫీవర్
విద్యుత్ శాఖలో బదిలీల ఫీవర్ మొదలైంది...
- జిల్లాలో నలుగురు డీఈలకు
- తప్పని బదిలీ
- 38 మంది ఏఈలు,
- ఐదుగురు ఏడీఈలకూ..
- 27లోగా బదిలీలు పూర్తి
సాక్షి, విజయవాడ : విద్యుత్ శాఖలో బదిలీల ఫీవర్ మొదలైంది. చీఫ్ ఇంజినీర్ క్యాడర్ మొదలుకొని అటెండర్ క్యాడర్ వరకు అన్ని కేటగిరిల్లో బదిలీలు చేయాలని డిస్కం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలు కూడా విడుదల చేయటంతో సర్కిల్ కార్యాలయం ఉద్యోగుల హడావుడితో కోలాహలంగా మారింది. కొన్ని కీలక పోస్టులకు విపరీతమైన పోటీ ఉండటంతో బదిలీల్లో రాజకీయ జోక్యం పెరిగి ప్రజాప్రతినిధులు మొదలుకుని అమాత్యుల వరకు అందరూ సిఫార్సులు మొదలుపెట్టారు. జిల్లాలో ప్రధానంగా ఆఫీసర్స్ కేటగిరిలో దాదాపు 47 మందికి స్థాన చలనం కలిగే అవకాశం ఉంది.
ఒకేస్థానంలో మూడేళ్లు పదవీకాలం పూర్తి చేసుకున్న వారు, ఒకే స్టేషన్ (సబ్ డివిజన్) పరిధిలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారందరూ బదిలీకి అర్హులుగా గుర్తించారు. జిల్లా సిబ్బంది సంఖ్యను దృష్టిలో ఉంచుకొని 20 శాతం మందిని మాత్రమే బదిలీలు చేయాలని మార్గదర్శకాలు ఉన్నాయి. దీంతో అన్ని కేటగిరిల్లో బదిలీల జాబితా సిద్ధం చేశారు. ఏఈ క్యాడర్ వరకు ఎస్‌ఈ నేతృత్వంలో బదిలీలు జరుగుతాయి. ఈనెల 16నబదిలీలకు మార్గదర్శకాలు రాగా 20 వరకు బదిలీల వినతులను జిల్లా ఎస్‌ఈ బి.మోహనకృష్ణ స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 60కిపైగా వినతులు అందాయి. జిల్లాలో రూరల్ డివిజనల్ ఇంజినీర్ సత్యానందం, డీఈ (ట్రాన్స్‌ఫార్మర్స్) జి.సుబ్రమణ్యం, డీఈ (మీటర్, ప్రొడక్షన్) జేవీటీఎస్ ప్రసాద్, విజిలెన్స్ డీఈ సుబ్బారావు తదితరులు బదిలీలు తప్పనిసరిగా మారాయి. నలుగురు డీఈలు ఒకే చోట మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోవటంతో బదిలీలు అనివార్యం అయ్యాయి. అలాగే జిల్లాలో 5గరు ఏడీఈలు, 38 మంది ఏఈలు బదిలీ జాబితాలో ఉన్నారు. బదిలీలను 27వ తేదీలోగా పూర్తి చేసి వచ్చేనెల 3న రిలీవ్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఆగిన ఎస్‌ఈ బదిలీ
వాస్తవానికి జిల్లా ఎస్‌ఈ మోహనకృష్ణ కూడా తొలుత బదిలీ జాబితాలో ఉన్నారు. ఇక్కడ మూడేళ్లుగా ఈ స్థానంలో పని చేస్తున్నారు. అయితే మరో 10 నెలల్లో ఆయన పదవీ విరమణ ఉండటంతో బదిలీ నుంచి ఆయనకు మినహాయింపు ఇచ్చారు. అలాగే చీఫ్ ఇంజినీర్ రాజబాపయ్య కూడా మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోవడంతో బదిలీ తప్పదని అందరూ భావించారు. అయితే డిస్కం పరిధిలో ఒక్కటే చీఫ్ ఇంజినీర్ పోస్ట్ ఉండటం, అర్హులు ఎవరూ లేకపోవడంతో ఆయన్నే కొనసాగించనున్నారు.
రాజకీయ ఒత్తిళ్లు
ఇదిలా ఉంటే విద్యుత్ శాఖలో కొన్ని హాట్ సీట్లు బదిలీ జాబితాలో ఉన్నాయి. ఈక్రమంలో పదుల సంఖ్యలో ఆశావాహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా ఏఈ కేటరిలో గవర్నర్‌పేట, ముత్యాలంపాడు, కానూరు, గుణదల తదితర ప్రాం తాల ఏఈ పోస్టులకు విపరీతమైన డిమా ండ్ ఉంది. ఆశావాహులు ముందుగా కార్యాలయ అధికారులను కలవటం కం టే ఆయా నియోజకవర్గ ప్రజాప్రతినిధులను కలిసి తమకు కావాల్సిన పోస్టు గురించి మాట్లాడుకొని వ్యవహారం అంతా చక్కబెట్టుకున్న తర్వాత సిఫార్సు లేఖతో అధికారులను కలుస్తున్నారు. నగరంలో ముగ్గురు ఎమ్మెల్యేలు, జిల్లాలోని ముగ్గురు ఎంపీలు, మంత్రులందరూ సిఫార్సు లేఖలు ఇవ్వడంతోపాటు ఎస్ ఈ, ఇతర అధికారులపై తప్పనిసరిగా బదిలీలు చేయాలని ఒత్తిళ్లు తెస్తున్నారు.