రాత్రంతా జాగారం | Tree Collapsed On Power Lines | Sakshi

రాత్రంతా జాగారం

Published Thu, Mar 29 2018 11:40 AM | Last Updated on Thu, Mar 29 2018 11:40 AM

Tree Collapsed On Power Lines - Sakshi

బొర్రాగుహలు స్టేషన్‌లో నిలిచిపోయిన జగదల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌

రాత్రి ఒంటి గంట.. జగదల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు.. వారు ఉదయానికి విశాఖ చేరుకోవాలి.. అంతలో బొర్రాగుహలు స్టేషన్లో రైలు నిలిచిపోయింది.. గంటలు గడుస్తున్నా కదలకపోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది.. అప్పుడు తెలిసింది విద్యుత్‌ వైర్లపై చెట్టు పడి అంతరాయం ఏర్పడిందని.. దీంతో రైల్లో ప్రయాణిస్తున్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి.. బుధవారం ఉదయం 10.30 గంటలకు గానీ పునరుద్ధరణ పనులు పూర్తికాలేదు.. అదీ పాక్షికంగానే..

అనంతగిరి (అరకులోయ):కొత్తవలస–కిరండూల్‌ (కేకే) లైన్లో మంగళవారం రాత్రి ప్రయాణికులు నరకం చూశారు. వివిధ పనులపై విశాఖ వెళదామని రైలెక్కిన వారంతా అర్ధరాత్రి పూట మార్గమధ్యంలో బండి నిలిచిపోవడంతో నానా అవస్థలు పడ్డారు. విద్యుత్‌ వైర్లు తెగిపడడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చిమిడిపల్లి–తైడా మధ్యలో 58/89లో ఓహెచ్‌సీ విద్యు™Œ వైర్లు, స్తంభాలపై చెట్టు పడడంతో సమస్య తలెత్తింది. రాత్రి 1 గంట సమయంలో ఓహెచ్‌ఈ విద్యుత్‌ వైర్ల మీద చెట్టు పడడం వల్ల జగదల్‌పూర్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలును బొర్రా రైల్వే స్టేషన్‌ వద్ద నిలిపివేశారు. వేసవి కాలం కావటంతో ఆకులు రాలిపోయి చెట్లు ఎండిపోతున్నాయి. వీటికి కొద్దిపాటి నిప్పు రవ్వ అంటుకున్నా అది కార్చిచ్చుగా మారి అడవిని సైతం తగులబెట్టే విధంగా మంటలు చెలరేగుతున్నాయి.

ఈ విధంగా మంగళవారం రాత్రి అనంతగిరి మండలంలో ఎక్కడ బడితే అక్కడ కార్చిచ్చు చెలరేగింది. కేకే లైన్‌ను అనుకుని ఉన్న కొండపై ఓ వృక్షానికి నిప్పు అంటుకుని అది నేలకొరిగింది. తైడా, చిమిడిపల్లి స్టేషన్ల మధ్య ఒంటిగంట సమయంలో విద్యుత్‌ తీగలపై పడింది. దీంతో ఈ సమయంలో ప్రయాణిస్తున్న రైళ్లను రైల్వే అధికారులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. జగదల్‌పూర్‌ నుంచి విశాఖపట్నం వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు బొర్రా స్టేషన్లో నిలచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రంతా అవస్థల మధ్య గడిపారు. రైల్వే సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని వృక్షాన్ని యుద్ధప్రతిపాదికన తొలగించడంతో బుధవారం ఉదయం 10.30 గంటలకు రైలు కదిలింది.

జగదల్‌పూర్‌ వరకే కిరండూల్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): కేకే లైన్లో బుధవారం తెల్లవారుజామున చెట్ల కొమ్మలు విరిగిపడడంతో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల విశాఖపట్నం–కిరండూల్‌–విశాఖపట్నం(08512/11)స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బుధవారం జగదల్‌పూర్‌ వరకే నడిచిందని ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే వాల్తేర్‌ డివిజన్, సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ జి.సునీల్‌కుమార్‌ తెలిపారు. తిరుగు ప్రయాణంలో గురువారం ఈ రైలు కిరండూల్‌ నుంచి కాకుండా జగదల్‌పూర్‌ నుంచి విశాఖపట్నం వస్తుందని ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు.   పూర్తి టికెట్‌ డబ్బులు ఇవ్వాలని ప్రయాణికులు రైల్వే సిబ్బందిని డిమాండ్‌ చేశారు. అయితే రైల్వే సిబ్బంది  ప్రయాణికుల టికెట్‌ డబ్బులో 50 శాతం తిరిగి ఇచ్చారు.

నరకం చూశాం..
రాత్రంతా బొర్రా స్టేషన్‌లోనే గడిపాం. అర్ధరాత్రి రైలు నిలిచిపోవడంతో పిల్లా పాపలతో ప్రయాణిస్తున్న కుటుంబాలన్నీ తీవ్ర అవస్థలు పడ్డాయి. తాగడానికి మంచి నీరు సైతం దొరకలేదు. బొర్రా గుహల నుంచి ములియగుడ చేరుకుని విశాఖపట్నం వెళుతున్నాం.– శరభన్, జగదల్‌పూర్‌

అర్జంటు పనులు ఆగిపోయాయి..
కోరాపుట్‌ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు రైలెక్కాను. రాత్రి ఒంటిగంటకు నిలిచిపోయిన రైలు తెల్లారినా కదలకపోవడంతో నా పనులన్నీ ఆగిపోయాయి. రాత్రంతా ఆందోళనే. చాలా ఇబ్బందులకు గురయ్యాం.            – చైతన్య, కోరాపుట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement