పాచిపెంట మండలం చాపరాయివలస గ్రామంలో గిరిజన యూనివర్శిటీ కోసం పరిశీలించిన స్థలం
గిరిజన వర్సిటీ పేరు సార్థకం కానుంది. అడవిబిడ్డల చెంతకే చదువులమ్మ చేరనుంది. సాలూరు నియోజకవర్గంలోనే ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇందుకోసం ఇప్పటికే పాచిపెంట మండలంలో స్థల పరిశీలన కూడా పూర్తయింది. ఇప్పటివరకూ వర్సిటీ ఏర్పాటు విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. తొలుత కొత్తవలస మండలంలో దీనిని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం భావించినా... అక్కడ ఏర్పాటువల్ల కలిగే సమస్యలను గుర్తించి... నిజమైన గిరిజన ప్రాంతాన్ని ఏర్పాటు చేయడంలో సర్కారు సఫలీకృతమైంది.
సాక్షి, విజయనగరం : సాలూరు నియోజకవర్గంలోని అచ్చమైన గిరిజన ప్రాంతంలోనే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. పాచిపెంట మండలం వేటగానివలస పంచాయతీ పరిధి లోని చాపరాయివలస గ్రామంలో సుమారు 411 ఎకరాల్లో యూనివర్శిటీ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ వెంకటరమణారెడ్డి స్థల పరిశీలన చేశా రు. గిరిజన యూనివర్సిటీ నిర్మాణ శంకుస్థాపనకు సెప్టెంబర్‌లో సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి రానున్నట్లు ఆయన ప్రకటించారు. వెనుకబడ్డ జిల్లాలో విద్యా ప్రమాణాల మెరుగు కో సం, ఎందరో గిరిజనుల బతుకుల్లో విద్యా సౌరభాలు నింపడానికి గిరిజన విశ్వ విద్యాలయం కల సాకారం కాబోతోంది. ఈ ఏడాది గిరిజన యూనివర్సిటీ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఏడు కోర్సుల్లో 150 మంది విద్యార్ధులు చేరారు. గిరిజన యూనివర్శిటీకి మెంటార్‌గా ఆంధ్ర విశ్వవిద్యాలయం వ్యవహరిస్తోంది. దీంతో విజయనగరంలోని ఆంధ్రాయూనివర్సిటీ పీజీ సెంటర్‌లోనే మంగళవారం నుంచి తరగతులు మొదలయ్యాయి.
విభజన హామీల అమలులో గత ప్రభుత్వం విఫలం
విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం చేత అమలు చేయించడంలో గత టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీ అనేక ఉద్యమాలు, వినతుల ద్వారా యూ నివర్శిటీ ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వానికి తెలి యజెప్పింది. దానిని పరిగణనలోకి తీసుకుని కేంద్రం రూ.420 కోట్లు మంజూరు చేసింది. తొలుత ఈ యూనివర్శిటీని కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూ పరిధిలోని అప్పన్నదొరపాలెం పంచాయతీ తమ్మన్న మెరకల వద్ద ఏర్పా టు చేయాలనుకున్నారు. సర్వేనంబరు 1/8లో 526.24 ఎకరాలను అప్పటి ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రహరీ నిర్మాణానికి రూ.5 కోట్లను, మౌలిక సదుపాయాల కోసం బడ్జెట్‌లో మరో రూ.5 కోట్లను కేటాయించింది.
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కారణంగా ఆ భూముల్లో 178 కుటుంబాలు నిర్వాసితులుగా మారుతున్నట్లు గుర్తించారు. వీరికి భూమికి భూమి అప్పగించేందుకు దారపైడితల్లమ్మ గుడికి సమీపంలో భూసేకరణ కూడా చేశారు. కానీ ఇది పూర్తిగా అటవీ ప్రాంతం కావటంతో చదునుచేసి ఇస్తామని అప్పటి గనులశాఖ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు హామీ ఇచ్చారు. కానీ ఆ నిధులు రాలేదు. ఏ ఒక్కరికీ భూములు అప్పగించలేదు. ప్రహరీ నిర్మాణం కాంట్రాక్టు కూడా టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బంధువుకే కట్టబెట్టారనే ఆరోపణలు వచ్చాయి.
గిరిజన ప్రాంతంలోనే వర్సిటీ...
గిరిజన యూనివర్శిటీని గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం సాలూరు ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది. విజయనగరం జిల్లాలో వైఎస్సార్‌సీపీకి తిరుగులేని ఆదరణ ఉంది. ముఖ్యంగా గిరిజనం మొదటి నుంచీ ఆ పార్టీతోనే ఉన్నారు. గిరిజన ప్రజాప్రతినిధులైన పాముల పుష్పశ్రీవాణి, పీడిక రాజన్నదొర గతంలోనూ, ఇప్పుడూ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. గిరిజన ఆడబిడ్డ పుష్పశ్రీవాణి ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా దక్కించుకుని గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. ఈ విధంగా గిరిజనులకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. అక్కడితో ఆగకుండా గిరిజన యూనివర్శిటీని గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటు చేసేందుకు ఆయనే స్వయంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాష్ట్రం, జిల్లా ప్రజాప్రతినిధుల చొరవతో వచ్చే నెలలోనే గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment