ఉద్యమానికి సై!
♦ ఏకీకృత సర్వీస్ రూల్స్‌లో గిరిజన సంక్షేమ
♦ ఉపాధ్యాయులకు అన్యాయం
♦ ఉద్యమాలకు సన్నద్ధమవుతున్న గురువులు
♦ జూలై మూడో తేదీ నుంచి ఆందోళన బాట
ఉమ్మడి సర్సీస్ రూల్స్ వర్తింపజేయకపోవడంపై గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. తమకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందుతున్నారు. వచ్చేనెల మూడో తేదీ నుంచి దశలవారీ ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు. మూడున ఐటీడీఏల వద్ద ధర్నాలు చేయతలపెట్టారు. 9న విశాఖపట్టణంలో రాష్ట్రస్థాయిలో గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమావేశం జరపడానికి నిర్ణయించారు. ఏళ్ల తరబడి గిరిజన సంక్షేమ శాఖలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న తమకు అన్యాయం జరగడాన్ని సహించలేకపోతున్నారు.
సీతంపేట(పాలకొండ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 10 వేల మంది గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు ఉండేవారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ఆరు వేలమంది వరకు పనిచేస్తుండగా.. శ్రీకాకుళం జిల్లాలో 600 మంది వివిధ గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలు, గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ వర్తింపచేస్తూ ఇటీవల రాష్ట్రపతి ఉత్వర్వులు వెలువడ్డాయి. అయితే గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులకు ఎటువంటి ఉమ్మడి సర్వీస్ రూల్స్ వర్తింపజేయలేదు.
దీంతో తమకు అన్యాయం జరిగిందని గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. 1975లోనే విద్యాశాఖ ఉపాధ్యాయులతో సమానంగా 674, 675 జీవోలను, 25.05.76 ప్రకారం 1976లో గిరిజన సంక్షేమ టీచర్లకు లోకల్ కేడరు ఆర్గనైజేషన్ కాబడిందని, 1988లో జీవో నంబర్ 32 తెలుపుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆవిర్భావం నుంచి 010 పద్దు కింద జీతాలు డ్రా చేస్తున్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ పొందడానికి అన్ని అర్హతలు ఉన్నా 40 ఏళ్లుగా గిరిజన సంక్షేమ టీచర్లు ఎటువంటి పరిపాలనా పరమైన, ఉన్నతమైన పదోన్నతులు పొందలేకపోతున్నారు. నిబంధనల ప్రకారం మెమో నంబర్ 1656 కె.కె.1/68 ప్రకారం ప్రభుత్వ విద్యాశాఖ ఉపాధ్యాయులకు వర్తించే అన్ని ఉత్తర్వులు గిరిజన సంక్షేమ శాఖ టీచర్లకు వర్తించాలి.
2006 మార్చి పదో తేదీన ఆర్‌సీ నంబర్–ఏ 4145 ప్రకారం ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ 27, 2005 చట్టానికి సవరణలు చేస్తూ ఆ చట్టములో గిరిజన సంక్షేమ శాఖ టీచర్లను కూడా ఆర్డినెన్స్‌లో చేర్చమని, కామన్ సర్వీస్ రూల్స్‌లో కూడా వీరిని చేర్చాలని, కామన్ సర్సీస్ రూల్స్‌లో కూడా చేరుస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపించారని తెలిపారు. 2008లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఏపీ ట్రైబల్ అడ్వయిజరీ కౌన్సిల్ 2008లో 17 మంది గిరిజన ఎంఎల్‌ఏలు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి గిరిజన సంక్షేమ టీచర్లను, విద్యాశాఖ ఉమ్మడి సర్వీస్ రూల్స్‌లోకి తీసుకు రావాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులకు అన్యాయం జరిగింది.
ఇవీ డిమాండ్‌లు..
గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నారు. వాటిలో ప్రధానమైనవి.. పాఠశాల విద్యాశాఖ, గిరిజన సంక్షేమ కార్యదర్శుల సమక్షంలో గిరిజన సంక్షేమ శాఖ సర్వీస్ రూల్స్ కమిటీతో సమావేశం ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ప్రభుత్వ సర్వీస్ రూల్స్ తయారీలో ఏర్పాటు చేసిన కమిటీలో గిరిజన సంక్షేమ శాఖ నుంచి ఒక రాష్ట్రస్థాయి అధికారిని, గిరిజన సంక్షేమశాఖ సర్వీస్ రూల్స్ సాధన కమిటీ నుంచి ఒక రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ ప్రతినిధిని నియమించాలని, ఇక నుంచి సర్వీస్ రూల్స్‌పై పంపే ప్రతీ ఫైల్‌లోనూ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ టీచర్స్ అని రాసినప్పుడు ఇన్‌క్లూడింగ్ గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ అని రాయాలని గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.