శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) చిట్టచివరి సమావేశం వాకౌట్ల పర్వంతో ముగిసింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను
తిరస్కరణ తీర్మానంపై టీఆర్‌ఎస్, ఎంఐఎం నిరసన
సమావేశాలు పొడిగించేందుకు సర్కారు నో
స్పీకర్ మనోహర్‌కు అభినందనలు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) చిట్టచివరి సమావేశం వాకౌట్ల పర్వంతో ముగిసింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించడానికి రాష్ట్ర శాసనసభ సమావేశం సోమవారం నుంచి ప్రారంభమైంది. బడ్జెట్‌ను సమర్పించిన అనంతరం స్పీకర్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, శైలజానాథ్, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, టీడీపీ నుంచి అశోక్‌గజపతిరాజు, గాలి ముద్దు కృష్ణమనాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి శోభానాగిరెడ్డి, సుచరిత, టీఆర్‌ఎస్‌నుంచి ఈటెల రాజేందర్, హరీష్‌రావు, సీపీఐ నుంచి గుండా మల్లేశ్, సీపీఎం నుంచి జూలకంటి రంగారెడ్డి, లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ తదితరులు హాజరయ్యారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్ర పునర్వ్య వస్థీకరణ బిల్లుపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రతిపాదించిన తిరస్కరణ తీర్మానాన్ని స్పీకర్ ఏకపక్షంగా మూజువాణి ఓటుతో ఆమోదించడంపై అసెంబ్లీ చివరిరోజున తాము నిరసన తెలపనున్నామని టీఆర్‌ఎస్, సీపీఐ, బీజేపీ, టీ కాంగ్రెస్ సభ్యులు సమావేశంలో సభాపతికి చెప్పారు. తమ నిరసన రికార్డుల్లో నమోదు అయ్యేందుకు వీలుగా ఆరోజున తమకు అవకాశమివ్వాలని కోరారు.
తెలంగాణ ప్రాంత ప్రతినిధుల మనోభావాలను, అభిప్రాయాలను గుర్తించకుండా బిల్లును ఏకగ్రీవంగా ఎలా ఆమోదిస్తారంటూ టీఆర్‌ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ చర్యకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు చెప్పి బయటకు వెళ్లిపోయారు. బిల్లుపై తీర్మానం గురించి తాము తొలినుంచి అడిగినా సమాచారం ఇవ్వకుండా చివరి నిమిషంలో ఎజెండాలో లేకుండా తిరస్కరణ తీర్మానాన్ని సభలో పెట్టడం సరికాదంటూ ఎంఐఎం సభ్యులు నిష్ర్కమించారు. తీర్మానాన్ని ఆమోదించిన తీరుపై గండ్ర కూడా నిరసన తెలిపారు. ఈ సమయంలో సీమాంధ్ర నేతలు స్పీకర్‌కు మద్దతుగా నిలిచారు. తిరస్కరణ తీర్మానం సరైనదేనంటూ స్పీకర్ చర్యలను అభినందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేత శోభానాగిరెడ్డితో పాటు మంత్రులు ఆనం, శైలజానాథ్‌లు, ఇతర నేతలు స్పీకర్ చర్యను సమర్థించారు. ఇలావుండగా సమావేశాలను మరో రెండురోజులు పొడిగించాలని టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, లోక్‌సత్తా పార్టీలు డిమాండ్ చేశాయి. ఇందుకు అధికారపక్షం సమ్మతించలేదు. ప్రస్తుత అసెంబ్లీ కాలంలో గతంలో ఎన్నడూలేని అనేక ఒడిదుడుకులు, పలు సవాళ్లు ఎదురైనా, కొత్త వివాదాలు ఏర్పడినా.. సభను సజావుగా నడిపించిన స్పీకర్ మనోహర్‌ను సభ్యులు అభినందించారు.
బడ్జెట్ కొత్తసీసాలో పాతసారా: టీడీఎల్పీ
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ కొత్త సీసాలో పాతసారా మాదిరిగా ఉందని తెలుగుదేశం శాసనసభాపక్షం అభిప్రాయపడింది. బడ్జెట్ అంకెల గారడీతో తప్పులతడకగా ఉందని, ఇందులో కొత్తదనం ఏమీ లేదని గాలి ముద్దుకృష్ణమనాయుడు, అశోక్‌గజపతిరాజు అన్నారు.