సాక్షి, తిరుమల: ఎట్టకేలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను బుధవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌కు పంపించారు. వ్యక్తిగత కారణాల వల్ల టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాల్సిందిగా కోరారు. ఇప్పటికే పలువురు టీటీడీ బోర్డు సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
కాగా సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా పరాజయం పాలైన విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడటంతో నైతిక బాధ్యత వహించి నామినేటెడ్ సంస్థల చైర్మన్లు, సభ్యులు రాజీనామా చేస్తున్నారు. కానీ, టీటీడీ పాలకమండలి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. సాంకేతిక అంశం సాకుతో నిన్న మొన్నటి వరకూ టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేసేది లేదని... తమని ప్రభుత్వం నియమిస్తేనే ప్రమాణ స్వీకారం చేశామని, వాళ్లు రద్దు చేస్తేనే పదవులు వదులుకుంటామని, స్వచ్చందంగా మాత్రం రాజీనామా చేయనంటూ పుట్టా సుధాకర్ యాదవ్ భీష్మించుకున్నారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన చివరకు టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment