తిరుమల తిరుపతి దేవస్థానం
సాక్షి, తిరుపతి/తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టులో ఆరు రోజులపాటు భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించలేకపోతున్నట్లు ప్రకటించింది. శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ నిర్వహణ నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ శనివారం తెలిపారు. వచ్చే ఆగస్టు 11 నుంచి 16 వరకు నిర్వహించే ఈ క్రతువుపై చర్చించేందుకు తిరుమల అన్న మయ్య భవన్‌లో శనివారం పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం టీటీడీ చైర్మన్ ‘పుట్టా’మీడియాతో మాట్లాడుతూ.. మహాసంప్రోక్షణ నేపథ్యం లో ఆగస్టు 9వ తేదీ సా.6 గంటల నుంచి భక్తులను క్యూలైన్లు, వైకుంఠం కంపార్ట్‌మెంట్లలోకి అనుమతించబోమన్నారు. అప్పటివరకు క్యూలైన్లలో ఉన్న వారికే 10వ తేదీన శ్రీవారి దర్శనం కల్పిస్తామన్నారు. తిరిగి ఆగస్టు 17వ తేది ఉ.6 గంటల నుంచి భక్తులకు పునఃదర్శనం ప్రారంభమవుతుందన్నారు.
ఆగస్టు 11న అంకురార్పణ
12 ఏళ్లకొకసారి నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం ఆగస్టు 11న అంకురార్పణతో ప్రారంభమవుతుందన్నారు. ఆలయంలో మహాసంప్రోక్షణ జరిగే రోజులలో వైదిక కార్యక్రమాలు, శాంతి హోమాలకు ఎక్కువ ప్రాధాన్యత వుంటుందని చైర్మన్ చెప్పారు. ఈ సమయంలో భక్తులకు దర్శనం కల్పించేందుకు కొన్ని గంటల సమయమే ఉండడంవల్ల ఆగస్టు 11 నుంచి 16 వరకు ఆరు రోజులపాటు శ్రీవారి దర్శనాన్ని రద్దుచేయాలని ధర్మకర్తల మండలి నిర్ణయించిందన్నారు. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించి ఆయా తేదీల్లో తిరుమల యాత్రను రద్దు చేసుకోవాలని కోరారు. కాగా, మహా సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా టీటీడీ అన్ని సేవలు రద్దుచేసింది. ఈ కార్యక్రమం ముగిసే వరకు ఎవరినీ జయవిజయలను దాటి అనుమతించరు. సన్నిధి సిబ్బందిని కూడా రాముల వారి మేడదాటి అనుమతించరు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసులరాజు, టీటీడీ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.
మహాసంప్రోక్షణ అంటే..
నదులకు ప్రతి పన్నెండేళ్లకోసారి పుష్కరాలు నిర్వహిస్తున్నట్లే.. తిరుమల శ్రీవారికి కూడా అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు తెలియజేశారు. మొట్టమొదటిసారిగా 1958లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చివరిసారిగా 2006లో నిర్వహించగా.. మళ్లీ ఇప్పుడు ఆగస్టు 12 నుంచి 16 వరకు మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. నిజానికి ఆలయంలో మరమ్మతు పనులను నిర్వహించేందుకు నిర్దేశించిన కార్యక్రమమే మహా సంప్రోక్షణ. సాధారణంగా ప్రతి వైష్ణవ ఆలయాల్లో 12ఏళ్లకొకసారి దీనిని నిర్వహిస్తారు. అక్కడ చేయాల్సిన మరమ్మతులను బట్టి మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ఆగమ పండితులు నిర్ణయిస్తారు. కాగా, శ్రీవారి గర్భాలయంలోకి అర్చకులు, జీయ్యంగార్లు మినహా మరెవ్వరినీ అనుమతించరు. దీంతో అక్కడ జరిగే మరమ్మతులను వారే నిర్వహించాలి. ఇతర ఆలయాల్లో చేసే విధంగా ఇంజనీరింగ్ అధికారులను ఆలయంలోకి అనుమతించరు. మహా సంప్రోక్షణంలో మూలవిరాట్ పాదాలు, పద్మపీఠం మధ్యన అష్టబంధనం కార్యక్రమాన్ని మాత్రమే నిర్వహిస్తున్నారు.
మూడు విభాగాలుగా నిర్వహణ
బాలాలయ అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని మూడు విభాగాలుగా నిర్వహిస్తారు. మొదటగా శ్రీవారి మూలవిరాట్‌లో ఉన్న శక్తిని కుంభంలోకి ఆవాహనం చేస్తారు. శ్రీవారి ఆలయానికి పక్కనే ఉన్న పాత కళ్యాణమండపంలో ప్రత్యేకంగా 24 యాగశాలలను ఏర్పాటుచేయనున్నారు. స్వామి వారి శక్తిని ఆవాహన చేసిన కుంభాన్ని ఇక్కడ ఉంచుతారు. మూలవిరాట్‌కు నిత్యం నిర్వహించే పూజా కైంకర్యాలను ఈ కుంభానికి నిర్వహిస్తారు. ఆఖరి రోజున మహా సంప్రోక్షణతో స్వామి వారి శక్తిని తిరిగి మూలవిరాట్‌లోకి ఆవాహన చేస్తారు. ఈ కార్యక్రమంతో తిరిగి మూలవిరాట్‌ని నూతనంగా నిర్మించినట్లే. ఆగస్టు 15న మహాశాంతి తిరుమంజనం, ఆగస్టు 16న ఉదయం 10.16 గంటలకు తులా లగ్నంలో మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు.
అష్టబంధనం అంటే..
శ్రీవారి మూలవిరాట్ పాదాలకు పద్మపీఠం మధ్యలో ఉన్న భాగాన్ని లేపంతో నింపటమే అష్టబంధన కార్యక్రమం. ఈ కార్యక్రమం సందర్భంగా 8 రకాల వస్తువులతో తయారుచేసిన చూర్ణాన్ని శ్రీవారి పాదాల కింద, మూలవిరాట్ సమీపంలో ఉంచుతారు. ఇందులో నల్లసరిగళం, కరక్కాయ, ఎర్రపత్తి, వెన్న, కండచక్కెర, లక్క, చెకుముకిరాయి, బెల్లం.. ఈ 8 రకాల వస్తువుల మిశ్రమాన్ని మూలవిరాట్‌తో పాటు ఆధార్‌పీఠం, పాదపీఠం మధ్యలో సన్నపాటి ప్రదేశంలో, మూలవిరాట్ పైభాగంలో గోడకు వున్న రంధ్రాలలో ఈ చూర్ణాన్ని అద్దుతారు. కాలక్రమంలో ఈ మిశ్రమం కరిగిపోవడం.. రంగు మారడంవల్ల మూలవిరాట్‌లో శక్తి తగ్గిపోతుంది. తిరిగి ఆ శక్తిని పెంపొందించేందుకే ఈ మహోన్నత కార్యక్రమం.
నాలుగు వేదాలు పఠిస్తాం
మొదటిసారిగా కంకణభట్టార్‌గా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా వుంది. ఈ ఐదు రోజులపాటు నాతో కలిపి 45 మంది రుత్వికులు, దాదాపు 100 మంది వేద పండితులు, ప్రబంధ పండితులు, వేద విద్యార్థులు ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఐదు రోజులపాటు స్వామివారిని కుంభంలోకి ఆహ్వానించి దానిని యాగశాలలో శక్తిని నింపుతాం. అక్కడ రామాయణం, వేదపారాయణం, భగవద్గీత, నాలుగు వేదాలను పఠించి కుంభానికి శక్తిని నింపి ఆఖరు రోజున ఆ కుంభాన్ని తిరిగి స్వామివారిలోకి పంపుతాం.
– వేణుగోపాల్ దీక్షితులు, ప్రధాన అర్చకులు, ఆగమ సలహా మండలి సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment