ఇంత 'ఘాట్‌' నిర్లక్ష్యమా.. | TTD Officials Neglect On Tirumala Ghat Road | Sakshi
Sakshi News home page

ఇంత' ఘాట్‌ 'నిర్లక్ష్యమా..

Published Wed, Apr 4 2018 9:35 AM | Last Updated on Wed, Apr 3 2019 8:03 PM

TTD Officials Neglect On Tirumala Ghat Road - Sakshi

తిరుమల ఘాట్‌ రోడ్డులోకొండచరియల ముప్పుపైఇంజినీర్లు స్పందిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.తిరుపతి నుంచి తిరుమలకువెళ్లే రెండో ఘాట్‌లో ఏటా కొండ చరియలు కూలుతున్నా ఇంజినీర్లు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ మార్గంలో ప్రత్యామ్నాయం కల్పించాలని రెండేళ్లకు ముందు టీటీడీ నిర్ణయించింది. మొదటి, రెండోఘాట్‌ రోడ్ల్లకు అనుసంధానమైన లింక్‌రోడ్డు మోకాళ్ల పర్వతం నుంచి తిరుమల వరకు నాలుగులేన్లుగా విస్తరణకు నోచుకోలేదు. మరోవైపు మొదటి ఘాట్‌రోడ్డు కూడా ప్రమాదంఅంచులోకి చేరుతోంది.

సాక్షి, తిరుమల: తిరుమల ఘాట్‌రోడ్డుపై ఇంజినీర్లు కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు 1973లో 16 కిలోమీటర్ల నిడివిలో రెండో ఘాట్‌రోడ్డు నిర్మించారు. ఈ మార్గంలో రెండేళ్లుగా ఏడు కిలోమీటరు నుంచి 16వ కిలోమీటరు వరకు తరచూ కొండ చరియలు కూలుతున్నాయి. అలిపిరి నుంచి 12వ కిలోమీటరు హరిణి విశ్రాంతి షెడ్డు వరకు, అక్కడినుంచి 13వ కిలోమీటరు లింక్‌రోడ్డు వరకు, ఆ తర్వాత నుంచి 16వ కిలోమీటరు తిరుమల వరకు మూడు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఇందులో లింకురోడ్డు నుంచి తిరుమల వరకు మూడు కిలోమీటర్ల రోడ్డు తీవ్రంగా దెబ్బతింది. భవిష్యత్‌లో ఈ రోడ్డు మరింత ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉంది. వర్షాకాలం వచ్చిందంటే కొండ రాళ్లు కూలుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడక్కడ చైన్‌లింక్‌ ఫెన్సింగ్‌ పనులు కొనసాగుతున్నాయి.

ప్రత్యామ్నాయం లింకురోడ్డు మాత్రమే..
రెండో ఘాట్‌ రోడ్డులోని 13వ కిలోమీటరు నుంచి మొదటి ఘాట్‌రోడ్డు మోకాళ్ల పర్వతం వరకు అనుసంధానంగా లింక్‌రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం ఈ రోడ్డు టీటీడీకి ప్రత్యామ్నాయంగా ఉంది. మూడేళ్లకు ముందు రెండోఘాట్‌లోని 5వ కిలోమీటరు వద్ద రోడ్డుపై అడ్డంగా పడిన కొండ చరియలతో 20 రోజుల పాటు రెండో ఘాట్‌రోడ్డులోని ఐదు మలుపులు మూసివేశారు. ప్రత్యామ్నాయంగా వాహనాలను లింక్‌రోడ్డు మీదుగా తిరుమలకు అనుమతించారు. అరగంటపాటు అటుఇటుగా ఆపేసి పంపటం వల్ల రెండు వైపులా వెళ్లే భక్తులకు ట్రాఫిక్‌ జామ్‌తోపాటు రైళ్లు, విమాన ప్రయాణాలకు వెళ్లాల్సిన వారు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది.

ప్రమాదపుటంచుల్లో అవ్వాచ్చారి కోన కొండ..
తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్‌రోడ్డును 1945 ఏప్రిల్‌ 10వ తేదీన ప్రారంభించారు. ఈ మార్గంలో మోకాళ్ల పర్వతం నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు 1.5 కిలోమీటర్లు ఉంది. ఇది అతిప్రమాదకరం. ఈ మార్గంలో గతేడాది బ్రహ్మోత్సవాల వేళ భారీ కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన మరింత తీవ్ర స్థాయిలో జరిగి ఉంటే మొదటి ఘాట్‌రోడ్డును మూసివేయక తప్పని పరిస్థితి. అలాంటి సందర్భంలో టీటీడీకి ప్రత్యామ్నాయం లింక్‌రోడ్డు మాత్రమే వెసులుబాటు ఉండేది. కానీ లింక్‌రోడ్డు విస్తరణలో ఇంజనీర్లు చొరవ చూపటం లేదనే విమర్శ ఉంది. మొదటి ఘాట్‌లో నిటారుగా ఉండే ఈ అవ్వాచ్చారికోన కొండ మీద నుంచి బండరాళ్లు భవిష్యత్‌లో మరిన్ని కూలే అవకాశాలు ఉన్నాయని గతంలోనే నిపుణులు తేల్చారు. భవిష్యత్‌లో అలాంటి ఘటనలు జరిగితే ఈ లింక్‌రోడ్డు ద్వారా భక్తులను తిరపతికి తరలించే అవకాశం ఉంది.

మోకాళ్ల పర్వతం టు తిరుమలకు నాలుగులేన్ల విస్తరణ సాగేనా?
మోకాళ్ల పర్వతం నుంచి తిరుమలలోని జీఎన్‌సీ టోల్‌గేట్‌ వరకు ఉండే రోడ్డును నాలుగు లేన్లకు విస్తరించేందుకు రెండున్నరయేళ్లకు ముందు టీటీడీ పచ్చజెండా ఊపింది. మూడు కిలోమీటర్ల నిడివి కలిగిన ఈ రోడ్డు మార్గాన్ని రాకపోకలకు వీలుగా  నాలుగు లేన్లుగా విస్తరించాలని నిర్ణయించారు. భవిష్యత్‌లో ఎదురయ్యే గడ్డు పరిస్థితులకు ప్రత్యామ్నాయం చేయాలని సంకల్పించారు. నాలుగులేన్ల రోడ్డు విస్తరణపై సర్వే చేయాలని నిర్ణయించినా అది కార్యరూపం దాల్చలేదు. గతేడాది ఈఓగా వచ్చిన అనిల్‌కుమార్‌ సింఘాల్, జేఈఓ కేఎస్‌ శ్రీనివాసరాజు పనులు వేగవంతం చేయాలని ఆదేశించినా ఇంజినీర్లు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత మేలుకోవడం టీటీడీ ఇంజినీర్లకు అలవాటైపోయిందన్న విమర్శలున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement