‘జీ 24 గంటలు’పై రెండు కేసులు | Two cases filed on Zee 24 hours media | Sakshi
Sakshi News home page

‘జీ 24 గంటలు’పై రెండు కేసులు

Published Sat, Sep 14 2013 4:00 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

Two cases filed on Zee 24 hours media

సాక్షి, హైదరాబాద్: డీజీపీ దినేష్‌రెడ్డి గురువారం హైదరాబాద్ పాతబస్తీలోని ఫతేదర్వాజాలో ప్రముఖ ముస్లిం మత గురువు హజ్రత్ హబీబ్ ముజ్తబా అల్ హైద్రూస్‌ను కలవడంపై అవాస్తవాలు ప్రసారం చేశారంటూ ‘జీ 24 గంటలు’ వార్తా చానల్‌పై శుక్రవారం రెండు కేసులు నమోదయ్యాయి. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు ఒక కేసు నమోదు చేయగా, హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. డీజీపీ వెళ్లి హైద్రూస్‌ను కలవడంపై ‘జీ 24 గంటలు’ చానల్‌లో ‘స్పెషల్ స్టోరీ’ ప్రసారమైంది.
 
  గురువారం డీజీపీ తన వెంట ఎలాంటి ఫైళ్లను తీసుకువెళ్లలేదని, ఒంగోలులో స్వామిని కలిసినప్పుడు కూడా ఆయన కాళ్లకు మొక్కలేదని, వీటికి సంబంధించిన ఫోటోలను మార్ఫింగ్ ద్వారా సృష్టించి ప్రసారం చేరారని డీజీపీ కార్యాలయంలో పరిపాలన విభాగం ఏఐజీగా పని చేస్తున్న సుబ్బారావు శుక్రవారం సీసీఎస్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ 469, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్ 66 (ఏ) కింద కేసు నమోదు చేశారు. మరోవైపు తన తండ్రిని మంత్రగాడంటూ కల్పిత కథనాలను ప్రసారం చేశారంటూ హైద్రూస్ కుమారుడు హబీబ్ మహ్మద్ చేసిన ఫిర్యాదు మేరకు హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదైంది.
 
 జీ-24పై దాడిని ఖండించిన పాత్రికేయ సంఘాలు
 జీ-24 గంటలు చానల్ కార్యాలయంపై పోలీసులు శుక్రవారం చేసిన ఆకస్మిక దాడిని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ), ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్ల్యూజే), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్‌యూజే) నేతలు ఒక ప్రకటనలో ఖండించారు. విలేకరులపై కేసులు పెట్టడం, సోదాల పేరిట దాడులు చేయడం సరికాదన్నారు. దాడులు మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని పేర్కొన్నారు. అతిగా వ్యవహరించిన పోలీసులపై చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement