
మృత్యువులోనూ..వీడని ‘చిన్నారి స్నేహం’
విజయనగరం క్రైం: ఆ ఇద్దరు చిన్నారులు వరుసకు బావాబావమరుదులు. కలిసి ఆడుకోవడం, కలిసి పాఠశాలకు వెళ్లడం చేసేవారు. ఎక్కడికి వెళ్లినా ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. ఆ చిన్నారి స్నేహాన్ని చూసిన విధికి కన్నుకుట్టిందేమో? కోనేరు రూపంలో వాళ్లిద్దరినీ మృత్యుఒడిలోకి లాగేసింది. ఆ చిన్నారులిద్దరూ బంధువులు కూడా కావడంతో ఆ రెండు కుటుంబాల్లో అంతులేని విషాదం అలముకుంది. నిన్నటికి నిన్న మండలంలోని గుంకలాం గ్రామంలో చెరువులో పడి ముగ్గురు మహిళలు మృతిచెందిన సంఘటన నుంచి ఇంకా తేరుకోక ముందే తాజాగా ఆదివారం ఈ మరో హృదయ విదారక సంఘటన జరిగింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
విజయనగరం పట్టణంలోని కె.ఎల్.పురం కొండపేట చందకవీధిలో చందక శ్రీను కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. చందకశ్రీనుకు భార్య రామయ్య మ్మ, కుమారులు దిలీప్, తేజ (10)లు ఉన్నారు. కె.ఎల్.పురం కొండపేటలో మండల మారునాయుడు కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. మారునాయుడుకు భార్య రమణమ్మ, సతీష్ (14), చెల్లెలు హరిత ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం మండల కోనేరు సమీపంలో గేదెలు కాస్తున్న రైతు శ్రీనుకు మధ్యాహ్న భోజనం అందించేందుకు తేజ, సతీష్‌లతో పాటు కార్తీక్ అనే మరో విద్యార్థి కలిసి రెండు సైకిళ్లపై వెళ్లారు. శ్రీనుకు భోజనం అందించి వీరు రెండు సైకిళ్లను ఒక దగ్గర స్టాండ్ వేసి మండల కోనేరు మదుం వద్దకు చేరుకున్నారు.
వారిద్దరూ మదుంపైనుంచి నీటిలోకి దూకినట్లుగా తెలుస్తోంది. దూకే సమయంలో ఎక్కువ లోతు ఉన్న ప్రాంతానికి ఇద్దరూ వెళ్లడంతో నీటిలో కొట్టుకుంటున్నారు. ఆ సమయంలో స్నానానికి దిగిన కార్తీక్ కూడా మునిగిపోతుండగా కేకలు వేయడంతో సమీపంలో గేదెలు కాస్తున్న శ్రీను వెంటనే వచ్చి కార్తీక్‌కు కాపాడి ఒడ్డుకు చేర్చాడు. రైతు శ్రీను తక్షణమే స్థానికులకు సమాచారం అందించగా వారు పట్టణ అగ్నిమాపక కార్యాలయం సిబ్బందికి, వన్‌టౌన్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి చెరువులో ఉన్న తేజ మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ కె.రామారావు, ఎస్సై బి.రమణయ్య సంఘటనాస్థలానికి చేరుకుని మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. మృ త దే హాలను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. తేజ 6వ తరగతి చదువుతుండగా, సతీష్ ఏడో తరగతి చదువుతున్నాడు. తేజ తండ్రి శ్రీను జూట్ మిల్లు కార్మికుడు కాగా, సతీష్ తండ్రి పాల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
మిన్నంటిన రోదనలు..
ఆ చిన్నారుల తల్లిదండ్రుల రోదనలతో సంఘటనా స్థలం మార్మోగింది. ఎప్పుడూ భోజనాలు పట్టుకుని వెళ్లేవాడని కాదని, మృత్యువు కోసమే కోనేరు వద్దకు వెళ్లాడని తేజ తండ్రి భోరున విలపించాడు. సోమవారం నుంచి పాఠశాల ప్రారంభమవుతున్నట్లు సెల్‌ఫోన్‌లో మెసేజ్ కూడా వచ్చిందని.. పాఠశాల సెలవుకాకపోతే బతికేవాడని రోదించాడు. పిల్లాడిని ప్రాణంలా పెంచుకుంటున్నామని ఇంతలోనే కోనేరు మృత్యువు రూపంలో మింగేసిందని సతీష్ తల్లి రమణమ్మ గుండెలవిసేలా విలపించింది.
బాధితులను పరామర్శించిన నాయకులు
కోనేరులోపడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న కౌన్సిలర్లు మైలపల్లి పైడిరాజు, కోండ్రు శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టి.వై.దాసు, తాళ్లపూడి శ్రీను కేంద్రాస్పత్రికి వచ్చి మృతుల తల్లిదండ్రులను పరామర్శించారు.