
‘కూలి’న బతుకులు
గాజువాక: విశాఖలోని గాజువాక పరిధిలోని వడ్లపూడి నిర్వాసిత కాలనీ కణితిలో గోడ కూలిన సంఘటనలో విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. ఒక సామాజిక భవనం విస్తరణ పనుల కోసం చేపట్టిన పనుల్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇదే సంఘటనలో మరో ఇద్దరు కూలీలు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కణితి కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పక్కనగల ఆర్యవైశ్య సామాజిక భవనం విస్తరణ పనులను మూడు రోజుల కిందట ప్రారంభించారు. మింది దరి గుడివాడ అప్పన్న కాలనీలో నివాసం ఉంటున్న కణితి ఈశ్వరరావు, సాత్రబోయిన అనంతలక్ష్మి , మురళి, రాంబాబు, బంగారమ్మ రెండు రోజులుగా జేసీబీ తవ్విన గోతిలో మట్టిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.
వారు ఒక పక్క పని చేస్తుండగా మరోపక్క జేసీబీతో మిగిలిన గొయ్యి తవ్విస్తున్నారు. గొయ్యిని ఆనుకుని ఉన్న పాఠశాల ప్రహరీ కదలడాన్ని కూలీలు గమనించారు. వెంటనే జేసీబీ పని ఆపాల్సిందిగా డ్రై వర్‌రాముకు కేకలు వేసినప్పటికీ శబ్ధంలో అతడికి వినిపించలేదు. జేసీబీ వైబ్రేషన్‌కు గోడ మరింత బలహీనపడడంతో కూలీలందరూ గొయ్యి చివరన భాగంలో ఒక మూలకు చేరిపోయారు. గోడ లోపల ఉంటే ప్రమాదమని భావించిన ఈశ్వరరావు, అనంతలక్ష్మి గొయ్యినుంచి బయటకు వచ్చేందుకు గొయ్యి రెండో చివరకు పరుగులు తీశారు. వారు సరిగ్గా గొయ్యి మధ్యకు వచ్చేసరికి పాఠశాల ప్రహరీ ఒక్కసారిగా వారిపై కూలిపోయింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరూ మృతిచెందినట్టు ధ్రువీకరించారు. ఈశ్వరరావు మృతదేహాన్ని స్ట్రెచర్‌పై బయటకు తీసుకొచ్చారు.
అనంతలక్ష్మి మృతదేహం శిథిలాలకింద ఉండిపోవడంతో బయటకు తీయడం సాధ్యం కాలేదు. కొద్దిసేపటికి సంఘటనా స్థలానికి చేరుకున్న జోన్-2 డీసీపీ డాక్టర్ రామ్‌గోపాల్ నాయక్ దువ్వాడ, గాజువాక సీఐలను ఆదేశించడంతో మరో జేసీబీని తీసుకొచ్చి సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆమె మృతదేహాన్ని బయటకు తీయగలిగారు. ఈశ్వరరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. విజయనగరం జిల్లా వేపాడ మండలం నీలకంఠరాజపురానికి చెందిన అతను కూలి పనుల నిమిత్తం ఇక్కడకు వలస వచ్చి అప్పన్న కాలనీలో కుటుంబంతో సహా నివాసం ఉంటున్నాడు. అనంతలక్ష్మి స్వస్థలం గుడివాడ అప్పన్నకాలనీగా ఆమె సమీప బంధువులు తెలిపారు. ఆమెకు భర్త, ఐదేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న ఈశ్వరరావు భార్య అర్జునమ్మ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరైంది. రెండుసార్లు స్పృహ తప్పి పడిపోవడంతో బంధువులు ఆమెకు సపర్యలు చేశారు. సంఘటనా స్థలానికి పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్, వైఎస్సార్‌సీపీ నాయకులు అమర్‌నాథ్, నాగిరెడ్డి చేరుకుని పరిశీలించారు.
ఆ ముగ్గురూ మృత్యుంజయులు
ఈ గొయ్యిలోనే పని చేస్తున్న మరో ముగ్గురు కూలీలు మృత్యువును జయించారు. ప్రమాదాన్ని గమనించి గొయ్యిలోని ఒక చివర మూలకు వెళ్లిపోయి ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకున్నామని ప్రమాదం నుంచి బయట పడిన మురళి, రాంబాబు ‘సాక్షి’కి తెలిపారు. అప్పటివరకు తమను వెన్నంటే ఉన్న ఈశ్వరరావు, అనంతలక్ష్మి అకస్మాత్తుగా బయటకు పరుగులు తీయడంతో గోడకింద పడిపోయారని, తమకు ఒక్క మాట కూడా చెప్పకుండానే పరిగెత్తి వెళ్లిపోయారని వాపోయారు.