
అరట్లకోటలో విషాదం
పాయకరావుపేట: సముద్రస్నానం విషాదంతమైంది. రెండు కుటుంబాల్లో తీరని శోకం మిగిలి ంది. మండలంలోని పెంటకోటతీరంలో సోమవారం సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అరట్లకోట గ్రామానికి చెందిన 35 మంది యువకులు ఇదే మండలం గోపాలపట్నం ప్రాంతంలోని సీతమ్మవారి కొండకు పిక్‌నిక్‌కు వెళ్లారు. వనభోజనాలు అనంతరం కొందరు స్నానాల కోసం పెంటకోట తీరానికి వచ్చారు.
ఇందులో ఐదుగురు అక్కడి లైట్‌హౌస్ ప్రాంతంలో సముద్రంలోకి దిగారు. పెద్ద ఎత్తున వచ్చిన కెరటానికి లోపలికి కొట్టుకుపోయారు. సమీపంలోనివారు బి.మురళి, బి.శ్రీకాంత్, నరేంద్రలను రక్షించారు. వంగలపూడి అనిల్ కుమార్(20), బారుగుల రామకృష్ణ(16)లు గల్లంతయ్యారు. అక్కడే ఉన్న మత్స్యకారులు వలలు వేసి బోట్లు ద్వారా వెదికినా ఇద్దరి ఆచూకీ లేకుండాపోయింది.
అరట్లకోట,పెంటకోట గ్రామస్తులు, ఆయా కుటుంబసభ్యులు, బంధువులు తీరానికి చేరుకున్నారు. గాలింపు ముమ్మరం చేశారు. గల్లంతయినవారిలోని అనిల్ కుమార్ పాయకరావుపేట మంగవరం రోడ్డులో సెల్‌షాపు నిర్వహిస్తున్నాడు. తండ్రిలేడు. తల్లి వెంకటలక్ష్మి.తమ్ముడుసాయి ఉన్నారు. కుటుంబానికి ఇతనే పెద్దదిక్కు. మరో యువకుడు రామకృష్ణకు తల్లిదండ్రులు,అన్నయ్య ఉన్నారు. పాత గోనెసంచుల వ్యాపారం చేస్తూ తండ్రి సత్తిబాబుకి చేదొడుగా ఉంటున్నాడు. ఇద్దరు యువకుల గల్లంతుతో అరట్లకోటలో విషాదం అలుముకుంది. రెండు కుటుంబాలవారు, బంధువులు తీరానికి చేరుకుని రోదిస్తున్నారు.