
సాక్షి, విశాఖపట్నం : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బ్యాలెన్స్ తప్పినట్లుగా కనిపిస్తున్నారని శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగితే.. అరగంట కూడా గడవకముందే చంద్రబాబు పోలీసుల చేత స్టేట్‌మెంట్ ఇప్పించిన విషయాన్ని గుర్తుచేశారు. ఫ్లెక్సీల పేరిట చంద్రబాబు కట్టు కథలు చెప్పించారని తెలిపారు. టీడీపీ హయాంలో చింతమనేని అక్రమాలు చంద్రబాబుకు కనబడలేదా అని నిలదీశారు. విశాఖలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల పరిణామాలను బట్టి చూస్తే టీడీపీకి భవిష్యత్తులో సైతం గెలిచే అవకాశం లేదని స్పష్టమవుతందన్నారు. టీడీపీ నాయకులు పార్టీని వీడుతుంటే చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవడం లేదన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబును ఏమి అనకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.
ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసిన చరిత్ర చంద్రబాబుది కాదా అని ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్ రివర్స్ టెండరింగ్ అంశాన్ని ఢిల్లీలో నివేదిస్తే తప్పుపట్టడమే కాకుండా టీడీపీ నాయకులు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 840 కోట్లు ఆదా చేశామన్నారు. పోలీసులపై లేనిపోని ఆరోపణలు చేయడం మంచిది కాదని టీడీపీ నాయకులకు హితవు పలికారు. చంద్రబాబు వేధింపులు తట్టుకోలేకే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ చనిపోయారని ఆరోపించారు. ఎన్నికల్లో కోడెల ఓడిపోతే.. ఆ తరువాత చంద్రబాబు ఒక్కరోజు కూడా పిలవకుండా ఆయన్ని అవమానించారని అన్నారు. అసెంబ్లీ ఫర్నీచర్ పోవడంపై వైఎస్సార్‌సీపీ కేసు పెట్టలేదని గుర్తుచేశారు. కోడెల కుటుంబంలో చంద్రబాబు చిచ్చుపెట్టారని విమర్శించారు. బాబు ప్రోత్సాహంతోనే కుటుంబ సభ్యులు, కోడెలకు వివాదం రేగిందన్నారు