లక్ష్యం ముందు ఓడిన పేదరికం
Published Thu, Sep 5 2013 4:53 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : వెంటాడుతున్న పేదరికాన్ని చూసి ఆ విద్యార్థి వెరవలేదు. తండ్రి లేని లోటును తెలియకుండా కష్టం తెలియకుండా పెంచి, పెద్దచేసిన చేసిన తల్లి రుణం తీర్చుకోవాలనే ఆశయంతో సీఏ ఫైనల్స్‌కు సిద్ధమవుతున్నాడు. పేదరికం కారణంగా ఓ విద్యార్థి ప్రతిభ మరుగున పడిపోకూడదనే సదుద్దేశంతో ఉచిత విద్యను అందించి ప్రోత్సహించిన విద్యాసంస్థ నమ్మకాన్ని వమ్ముచేయకుండా జాతీయస్థాయిలో ప్రతిభను నిరూపించుకున్నాడు. నగరంలోని ఏటీ అగ్రహారం శివారు రామిరెడ్డినగర్‌కు చెందిన కోట సుబ్బారావు, సుభాషిణి దంపతులకు లీలా నాగకుమార్, అనూష ఇద్దరు సంతానం. ఇద్దరూ పదోతరగతి వరకు వేణుగోపాల్‌నగర్‌లోని నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాలలో చదివారు.
పిల్లలు చిన్నతనంలో ఉండగానే భర్త సుబ్బారావు అనారోగ్యానికి గురై ఇంటికే పరిమితం కావడంతో, తల్లి సుభాషిణి కష్టం చేసి పిల్లలను పెంచి, పెద్ద చేసింది. లీలానాగకుమార్ టెన్త్‌లో 535 మార్కులతో ఉత్థీర్ణత చెందాడు. టెన్త్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా మాస్టర్‌మైండ్స్‌లో సీటు సంపాదించాడు. విద్యార్థి కుటుంబ పరిస్థితులు తెలుసుకున్న సంస్థ డెరైక్టర్ మట్టుపల్లి మోహన్ అండగా నిలిచి ప్రోత్సహించారు. అహర్నిశలూ శ్రమించి సీనియర్ ఇంటర్లో వెయ్యికి 954 మార్కులతో ఉత్తీర్ణత చెందాడు. 2008-09 సీనియర్ ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి టాప్‌టెన్‌లో నిలిచాడు. ప్రతిభను గుర్తించిన మాస్టర్‌మైండ్స్ యాజమాన్యం సీఏ వరకూ ఉచిత విద్యను అందించేందుకు నిర్ణయించింది. అదే ఏడాది సీఏ-సీపీటీ రాసి అందులో అఖిల భారతస్థాయిలో 200 మార్కులకు 183 సంపాదించిన నాగకుమార్ ఒక్కమార్కు తేడాతో అఖిల భారతస్థాయి టాప్‌టెన్‌లో స్థానం పొందలేకపోయాడు. 2010లో ఐపీసీసీ పూర్తి చేసి, సీఏ ఇంటర్న్‌షిప్‌కు సిద్ధమయ్యాడు. ఇదే సమయంలో చెల్లెలు అనూష ఓ ఎయిడెడ్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేయగా, కుటుంబ పరిస్థితులు తెలిసిన మాస్టర్‌మైండ్స్ తమ సంస్థలోనే ఆమెకు ఉద్యోగం ఇచ్చింది.
కుటుంబ భారం మోస్తున్న తల్లికి చేదుడు వాదోడుగా నిలిచేందుకు నాగకుమార్ సైతం మూడేళ్ల ఇంటర్న్‌షిప్‌లో భాగంగా వచ్చే ఆదాయాన్ని తల్లికి ఇచ్చి, మరోవైపు సీఏ ఫైనల్స్, ఐసీడబ్ల్యూఏకు సన్నద్ధమయ్యాడు. ఐసీడబ్ల్యుఏ విద్యలో భాగంగా 2012లో విడుదలైన సీఎంఏ (కాస్ట్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ) ఇంటర్, 2013 ఆగస్టులో విడుదలైన ఫైనల్ ఫలితాల్లో వరుసగా రెండు సార్లు అఖిలభారతస్థాయిలో నాలుగో ర్యాంకు సాధించాడు. నవంబర్‌లో జరిగే సీఏ ఫైనల్స్‌కు సన్నద్ధమవుతున్నాడు. సీఏలో మూడేళ్ల ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి సీఏ ఫైనల్స్‌కు సన్నద్ధం అవుతున్న సమయంలో 2011 నవంబర్‌లో తండ్రి చనిపోయారు. తండ్రి మరణంతో మానసికంగా కుంగిపోయిన సమయంలో సంస్థ యాజమాన్యం తనకు ఎంతో ధైర్యం చెప్పిందని విద్యార్థి చెబుతున్నాడు. వారి ప్రోత్సాహంతో సీఏగా ఎదగాలనే లక్ష్యంతో రోజుకు 14 గంటలు కష్టపడి చదువుతూ సీఏ, సీఎంఏ రెండింటి ఆధారంగా మంచి ఉద్యోగంలో చేరి కుటుంబానికి అండగా నిలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
మానవతా ధృక్పదంతో సీటు ఇచ్చాం
విద్యారిథ కుటుంబ పరిస్థితి తెలుసుకుని మానవతా ధృక్పదంతో సీటు ఇచ్చి, ఉచిత విద్యను అందిస్తున్నాం. ఇంటర్‌లో చేరిన సమయంలో అతనొక్కడినే అదుకుంటున్నామనుకున్నాం. కానీ తాము అతనితో పాటు కుటుంబాన్ని ఆదుకుంటున్నామని తెలిసింది.
- మట్టుపల్లి మోహన్, డెరైక్టర్
Advertisement
Advertisement