ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హడావిడిగా విభజించాలని చూస్తే మరిన్ని తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతాయని న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని విభజించి తెలుగు ప్రజలు కొట్టుకొవాలని చూస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందని ఆయన మండిపడ్డారు. శ్రీశైలం,నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పరిష్కరించకపోతే భవిష్యత్తులో విభేదాలు తలెత్తుతాయని పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజలను సంతృప్తి పరచకుండా విభజించడం సరికాదని ప్రతాప్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
సీమాంధ్ర ప్రాంతాన్ని చైనా, పాకిస్థాన్ దేశాలాగా చూస్తుందని ఆయన కేంద్రం వైఖరిని తప్పుపట్టారు. రాష్ట్ర విభజన జరిగితే గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలని గతంలో కేంద్రానికి విన్నవించిన సంగతిని ఈ సందర్బంగా ఏరాసు ప్రతాప్ రెడ్డి గుర్తు చేశారు. విభజన అనివార్యమైతే రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కర్నూలు, అనంతపురం జిల్లా ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.