
దేవినేని ఉమా ,వల్లభనేని వంశీ
సాక్షి, విజయవాడ: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. పోలవరం కుడికాలువ పట్టిసీమపై ఏర్పాటు చేసిన పంపుసెట్లకు విద్యుత్ సరఫరా విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. మంత్రి ఉమా సొంత నియోజకవర్గం మైలవరంలో నీరు ఇచ్చి గన్నవరం నియోజకవర్గంలోని రైతులకు నీరు ఇవ్వకుండా తెర వెనుక రాజకీయం చేశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మరోసారి రోడ్డెక్కారు. త్వరలోనే ఈ వివాదాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్తానంటూ వెల్లడించారు.
ఉమా ద్వంద్వనీతి..
పోలవరం కుడి కాల్వ మైలవరం, గన్నవరం నియోజకవర్గాల మీదుగా కృష్ణానదికి చేరుతుంది. ఈ కాల్వ కోసం గన్నవరం రైతులు భూములు ఇచ్చారు. దీనికి ప్రభుత్వం రూ.700 కోట్లు చెల్లించింది. ఇక్కడ కాల్వల కంటే వ్యవసాయ భూములు ఎత్తుగా ఉండటంతో నీరు ఎక్కదు. పట్టిసీమ నీరు ఈ కాల్వ లో వెళ్తుండడంతో గన్నవరం నియోజకవర్గ రైతులు మోటార్లు పెట్టుకుని నీరు తోడుకుంటారు. అదే తరహాలో మైలవరం నియోజకవర్గంలోనూ రైతులు చేస్తారు. మంత్రి ఉమాకు, ఎమ్మెల్యే వంశీకి ఉన్న మనస్పర్ధల కారణంగా గన్నవరం నియోజకవర్గ రైతులు మోటార్ల ద్వారా నీరు తీసుకోవడం మంత్రికి మనస్కరించడం లేదు. తన నియోజకవర్గ రైతులకు మోటార్ల ద్వారా నీరు తోడుకునేందుకు అనుమతిచ్చే ఉమా గన్నవరం రైతుల విషయంలో మాత్రం పక్షపాత ధోరణి వహిస్తున్నారనే విమర్శలు ఆపార్టీ నేతల నుంచే వస్తున్నాయి.
ఆది నుంచి వివాదమే..
పట్టిసీమ నీరు వచ్చిన తొలి ఏడాది నుంచి నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. మొదటి ఏడాది గన్నవరం రైతులు మోటార్లు పెట్టగానే ఇరిగేషన్ అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చివరకు వివాదం అవ్వడంతో అనుమతించారు. రెండో ఏడాది అదే తంతు. దీంతో ఎమ్మెల్యే వంశీ ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన తరువాత ఆ ఏడాది అనుమతిచ్చారు. మూడో ఏడాది మోటార్లకు కరెంటు ఇవ్వకుండా విద్యుత్ అధికారులు మోకాలు అడ్డుపెట్టి చివరకు విద్యుత్ ఇచ్చారు. ఈ ఏడాది తిరిగి మోటార్లకు విద్యుత్ ఇవ్వబోమంటూ తెగేసి చెప్పారు. ఎస్పీడీసీఎల్ అధికారి నాయక్‌తో ఎమ్మెల్యే వంశీ ఫోన్‌లో మాట్లాడినా విద్యుత్ చార్జీలు చెల్లిస్తామని చెప్పినా లాభం లేకపోయింది. దీంతో సాగునీరు అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. కాగా సోమవారం ఉదయం టీడీపీ నాయకులు ధర్నా చేసి విద్యుత్ అధికారులకు మెమోరండం ఇచ్చినా ఫలితం లేకపోయింది. మైలవరం నియోజకవర్గంలో మోటర్లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చి..గన్నవరం నియోకవర్గంలో మోటార్లకు విద్యుత్ ఇవ్వకపోవడంతో పై ఎమ్మెల్యే వంశీ సీరియస్ అవుతున్నారు. మంత్రి దేవినేని ఉమా వల్లనే తమకు ఈ ఏడాది సాగు నీరు అందడం లేదని రైతాంగం అభిప్రాయపడుతోంది.
సీఎం దృష్టికి సమస్య..
విద్యుత్‌బిల్లులు చెల్లిస్తామని చెప్పినా మోటార్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకపోవడాన్ని నిరసిన్తూ ఎమ్మెల్యే వంశీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నారు. రైతులపై మంత్రి వ్యవహరిస్తున్న తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దనే తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఏమైనా అధికారపార్టీకి చెందిన ఈ ఇద్దరి నేతల కుమ్ములాటల మధ్య రైతన్నలు అల్లాడిపోతున్నారు.
విద్యుత్ సరఫరా కోరుతూ ధర్నా
గన్నవరం: మండలంలోని మెట్ట ప్రాంతాల్లో సాగునీటి చెరువులకు పట్టిసీమ నీటిని పంపింగ్ చేసుకునేందుకు వీలుగా మోటార్లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతూ స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద టీడీపీ నాయకులు సోమవారం ఆందోళన చేపట్టారు. పోలవరం కాలువ భూసేకరణకు సహకరించిన రైతులకు పట్టిసీమ నీటి సరఫరా చేసేందుకు విద్యుత్ సరఫరా ఇవ్వాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీచేసినప్పటికి ఆ శాఖ అధికారులు లెక్కచేయడం లేదని ఆ పార్టీ నేతలు అగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న మైలవరం నియోజకవర్గంలో నీటి పంపింగ్‌కు విద్యుత్ సరఫరా ఇస్తున్న అధికారులు, ఇక్కడే ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. అధికారుల వైఖరి వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటికైన అధికారులు వైఖరి మార్చుకోకపోతే ఎమ్మెల్యే ద్వారా సీఎంకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment