ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ పెడితే తన వంతుగా రూ.10 లక్షలు ఇస్తానని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు వెకిలిచేష్టలుగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ పెడితే తన వంతుగా రూ.10 లక్షలు ఇస్తానని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు వెకిలిచేష్టలుగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి వ్యాఖ్యానించారు. ఇటువంటి వెకిలి ప్రవర్తన, అవినీతి పనుల కారణంగానే ఆయన్ని సీఎం మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారని విమర్శించారు. మంగళవారం సచివాలయంలో వరద రాజులు రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను సొంత పార్టీ పెడుతున్నట్టు సీఎం కిరణ్ స్వయంగా ఎప్పుడూ ప్రకటించలేదని అది కేవలం మీడియా చేస్తున్న అసత్య ప్రచారమేననని చెప్పారు.
డీఎల్ రవీంద్రారెడ్డి అక్రమంగా రూ.2వేల కోట్లు సంపాదించారని, వైద్య మంత్రిగా ఉండగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 10శాతం సీట్లు కోత వేసి వాటిని ప్రైవేటు కళాశాలలకు కేటాయించేందుకు పావులు కదిపారని, ఇందుకు గాను ప్రైవేటు వైద్య కళాశాలల నుంచి రూ.30 కోట్లు లంచం తీసుకున్నారని ఆరోపించారు. డీఎల్ అవినీతి బాగోతాలు సోనియాగాంధీకి కూడా చేరడంతో ఆమె ఆదేశాల మేరకు సీఎం కిరణ్ డీఎల్‌ను బర్తరఫ్ చేశారన్నారు. సమైక్యాంధ్ర కోసం సీఎం కిరణ్ నిజాయితీగా పోరాడుతున్నారని వరదరాజుల రెడ్డి చెప్పారు.