'ఎంఎన్సీలకు ఏపీని తాకట్టు పెట్టేస్తారా'
ఆంధ్రప్రదేశ్లో బహుళ జాతీయ సంస్థల (ఎంఎన్సీల) రిటైల్ ఔట్లెట్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతి ఇవ్వడం దారుణమని వైఎస్ఆర్సీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఈ అనుమతుల వెనక ఉన్న గుట్టేంటని ప్రశ్నించారు. ఎంఎన్సీలకు ఏపీని తాకట్టుపెట్టడమే మీ లక్ష్యమా అని పద్మ నిలదీశారు.
అనుమతి ఇచ్చినందుకు టీడీపీ ప్రభుత్వానికి ఎన్ని వేల కోట్లు ముడుపులు అందాయని పద్మ ప్రశ్నించారు. గతంలో ఎఫ్డీఐలను వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడెందుకు మారారని పద్మ విమర్శించారు. అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో మరోలా వ్యవహరిస్తారా అని మండిపడ్డారు. కోట్లాదిమంది చిల్లరవర్తకులు మీకు గుర్తుకు రాలేదా అంటూ పద్మ.. చంద్రబాబును విమర్శించారు.