రైల్వేకోడూరు అర్బన్: అదనపు కట్నం కోసం అత్త, మామ, ఆడబిడ్డ తనను వేధిస్తున్నారని, తనకు తెలియకుండా తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని ఉర్లగడ్డపోడు అరుంధతివాడకు చెందిన కొమ్మలపూడి సుమలత అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె కథనం మేరకు.. చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడితో 2012 సంవత్సరంలో ఈమెకు వివాహమైంది. వివాహ సమయంలో ఈమె భర్త రేణిగుంట సమీపంలోని అమరరాజా ఫ్యాక్టరీలో పనిచేస్తాడని చెప్పారు. కానీ ఆ తర్వాత అతను ఉద్యోగం చేయడం లేదని తెలిసింది.
వివాహ సమయంలో సుమలత తల్లిదండ్రులు ఐదు తులాల బంగారు, రూ. 50 వేలు నగదు ఇచ్చారు. అయితే వివాహానికి రూ. 3 లక్షలు ఖర్చయిందని అద నపు కట్నం తేవాలని అత్త చంద్రమ్మ, మామ చంద్రయ్య, ఆడబిడ్డ లలిత వేధిస్తున్నారని పేర్కొంది. రెండుసార్లు తాను ఆత్మహత్యకు యత్నించగా తన తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారని తెలిపింది.
తర్వాత గ్రామపెద్దలు పంచాయతీ చేయడంతో తన భర్తతో సాఫీగా సంసారం చేస్తూ వచ్చానని, కానీ 2014 మార్చి 12వ తేదీన సుజాత అనే అమ్మాయిని తనకు తెలియకుండా తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని పేర్కొంది. వీరందరిపై కేసు నమోదుచేయాలని ఆమె ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ రామచంద్ర తెలిపారు.