అజ్ఞాతం వీడిన ఎమ్మెల్యే ... అరెస్ట్ చేయని పోలీసులు
పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ అజ్ఞాతం వీడారు. శనివారం ఆయన నెల్లూరు పట్టణం చేరుకున్నారు. అయితే రామకృష్ణ నెల్లూరు చేరుకున్నారన్న సమాచారం తెలిసిన ఆయన్ని అరెస్ట్ చేసేందుకు మాత్రం పోలీసులు జంకుతున్నారు. ఎమ్మెల్యే రామకృష్ణను వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసులను డిమాండ్ చేశారు. ఆయనపై నాన్బెయిల్బుల్ కేసు ఉన్న పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయకపోవడంపై వైఎస్ఆర్ సీపీ నేతలు పోలీసులపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎన్నికలు స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో గత శనివారం ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికకు జిల్లా కలెక్టర్ హాజరైయ్యారు. జడ్పీ ఛైర్మన్ ఎన్నికకు టీడీపీకి తగినంత సంఖ్య బలం లేదు. దాంతో జిల్లాలోని వెంకటగిరికి చెందిన అధికార టీడీపీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ వీరంగం సృష్టించారు. కలెక్టర్పై నానాదుర్బిషలాడి.. అక్కడే ఉన్న మైక్ను విరిచేశారు. దాంతో ఆ ఎన్నిక రసభాసగా మారి వాయిదా పడింది.
జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక ఈ నెల 13న నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా కలెక్టర్పై ఎమ్మెల్యే వీరంగం సృష్టించడంపై రెవెన్యూ సిబ్బంది ఆగ్రహాం వ్యక్తం చేసి... ఎమ్మెల్యే రామకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఎమ్మెల్యే రామకృష్ణపై నాన్బెయిల్ కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో రామకృష్ణ అజ్ఞాతంలోకి వెళ్లారు. రేపు నెల్లూరు జిల్లా ఛైర్మన్ ఎన్నికల జరగనుంది. దాంతో రామకృష్ణ మళ్లీ నెల్లూరు చేరుకున్నారు. ఇదిలా ఉండగా నెల్లూరు జిల్లాలో జడ్పీ ఛైర్మన్ ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలంటూ నగరానికి చెందిన వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. దాంతో జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎన్నికకు పరిశీలకుడిని పంపడంతో పాటు... ఎన్నికల ప్రక్రియ అంతా కెమెరాలో చిత్రీకరించాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.