నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: వారంతా స్నేహితులు..కూలీ, నాలీ చేసుకుని జీవనం సాగిస్తున్నారు..సంపాదించిన సొమ్ము జల్సాలకు, కుటుంబపోషణకు సరిపోక వక్రమార్గం పట్టారు..ఇటీవల కాలంలో అందరి నోళ్లలో నానుతున్న గొలుసు దొంగతనాల(చైన్ స్నాచింగ్)పై దృష్టిపెట్టారు. ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా ఎంచుకుని గొలుసు దొంగతనాలకు తెగబడ్డారు.
అందు కోసం మూడు బైక్‌లను కూడా అపహరించారు. చోరీ చేసిన సొత్తును అమ్మి జల్సాగా తిరుగుతూ చివరకు పోలీసులకు చిక్కిపోయారు. అరెస్ట్ చేసిన నలుగురు నిందితులు, వారు చేసిన నేరాల వివరాలను ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నెల్లూరు కిసాన్‌నగర్‌కు చెందిన పాత్రాలపాటి సువేకానంద, ఎన్టీఆర్‌నగర్ రాయపుపాళేనికి చెందిన ఎస్‌కే కరిముల్లా, నవాబుపేట లక్ష్మీపురానికి చెందిన మాణిక్యం మల్లికార్జున, కోటమిట్టకు చెందిన సయ్యద్ అంజాద్ స్నేహితులు.
బేల్దారి పనులు చేసుకునే వీరు ఖాళీ సమయాల్లో ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇలా సంపాదించిన సొత్తు జల్సాలు, కుటుంబపోషణకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించే మార్గాలపై దృష్టిసారించారు. ఈ క్రమంలో ఇటీవల తరచూ చైన్‌స్నాచింగ్‌లు జరుగుతున్నాయని, బైక్‌లపై వెళుతూ మెడల్లోని గొలుసులను లాగేస్తున్నారని తెలుసుకుని, ఇలాంటి దొంగతనాలకు పాల్పడాలని నిర్ధారించుకున్నారు. అందులో భాగంగా మొదట ఇళ్ల ముందు నిలిపివున్న మూడు బైక్‌లను అపహరించారు. అనంతరం నెల్లూరు, కోవూరు, కొడవలూరు మండలం రేగడిచెలిక ప్రాంతాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. నిందితులు ఈనెల 14వ తేదీ ఉదయం 9గంటలకు కోవూరు జాతీయరహదారి సమీపంలోని సాయిబాబాగుడి వద్ద వెళుతుండగా స్థానిక సీఐ మాణిక్యరావు ఆధ్వర్యంలో కోవూరు, కొడవలూరు ఎస్సైలు ఎం. గంగాధర్‌రావు, జగన్‌మోహన్ అరెస్ట్ చేశారు. విచారణలో పలు నేరాలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు.
నేరాలు ఇవే..
చోరీల కోసం మొదట యమహా క్రక్స్, హోండా షైన్‌ను చోరీ చేశారు. గతేడాదిలో జనవరి 19న రేగడిచెలికలో ఎం.గోవిందమ్మ మెడలోని రెండున్నర సవర బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఏప్రిల్ 19న నెల్లూరు కుసుమదళితవాడలో ఒంటరిగా నడిచివెళుతున్న నంబారూ రత్నమ్మ మెడలోని రెండున్నర సవర్ల బంగారు గొలుసు, నవంబర్ 12న నెల్లూరు బ్యాంక్ కాలనీలో బండారు అంజలికుమారి మెడలోని రెండున్నర సవర్ల గొలుసు, అదేనెల 21న కోవూరు శాంతినగర్‌లో ఇండ్ల హైమావతి మెడలోని రెండు ముక్కాలు సవర్ల గొలుసు, డిసెంబర్ 11న కోవూరు శాంతినగర్‌లో వేలూరు ప్రవీణ మెడలోని ఆరు గ్రాముల గొలుసు, బాలాజీనగర్ నిర్మల్‌నగర్‌లోని చిట్టి ఇందిరాదేవి మెడలోని రెండు ముక్కాలు సవర గొలుసును లాక్కెళ్లారు.
అదే నెల 17న కాపువీధిలో కాకుమాని విజయ మెడలోని రెండు ముక్కాలు సవర్ల గొలుసు, 24వ తేదీ నెల్లూరు వీఎంఆర్ నగర్‌లో మేటికాల నరసమ్మ మెడలోని ఆరు సవర్ల గొలుసు, ఈ ఏడాది జనవరి నాల్గో తేదీన కోవూరులోని ఆర్టీసీ జోనల్ వర్క్‌షాపు వద్ద దార్ల ఆదినారాయణకు చెందిన హోండా షైన్‌బైక్‌ను అపహరించారు. మొత్తంగా నిందితుల నుంచి రూ.4 లక్షల విలువచేసే 182 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1.50 లక్షల విలువచేసే మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సస్పెక్టడ్ షీట్లు తెరవనున్నట్లు ఎస్పీ తెలిపారు.
సిబ్బందికి రివార్డులు
నిందితులను పట్టుకోవడానికి కృషిచేసిన నెల్లూరు రూరల్ డీఎస్పీ వీఎస్ రాంబాబు, కోవూరు సీఐ మాణిక్యరావు, కోవూరు, కొడవలూరు ఎస్సైలు గంగాధర్, జగన్‌మోహన్, ఐడీ పార్టీ సిబ్బంది ఐ.వెంకటేశ్వర్లు, ఏఎస్సై కె. సురేంద్ర, పి.వి.కృష్ణయ్య, పి.విజయప్రసాద్, షేక్ సిరాజ్, షేక్ రియాజ్, శ్రీనివాసులు, జి.ఓంకార్ తదితరులను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.
జల్సాల కోసం దొంగలయ్యారు
Published Thu, Jan 16 2014 4:15 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement