
ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం (ఇన్‌సెట్లో) ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు
సాక్షి, వెంకటాచలం: ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సోమవారం వెంకటాచలానికి రానున్నారు. రెండు రోజుల పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఉదయం 11 గంటలకు చెన్నై నుంచి ప్రత్యేక రైల్లో వెంకటాచలం రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 11:15 గంటలకు స్వర్ణభారత్‌ట్రస్ట్‌కు చేరుకుంటారు. అక్కడ విశ్రాంతి తీసుకుని 12:45 గంటలకు సరస్వతీనగర్‌లోని బీఎంపీటీసీ మోడల్‌హౌస్‌కు చేరుకుంటారు. అక్కడే ఉన్న కమ్యూనిటీహాల్లో తెలుగు స్కాలర్స్‌తో సమావేశమై తిరిగి స్వర్ణభారత్‌ట్రస్ట్ చేరుకుని భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. ట్రస్ట్ ప్రాంగణంలో సాయంత్రం 5:15 నుంచి 7 గంటల వరకు జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరై రాత్రి స్వర్ణభారత్‌ట్రస్ట్‌లోనే బస చేస్తారు.
మంగళవారం ఉదయం 7:40 గంటలకు అక్షర విద్యాలయం చేరుకుని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో కలిసి అక్షర విద్యార్థులు, శిక్షణ పొందుతున్న యువకులతో సమావేశమవుతారు. 8:30 నుంచి 9:30 గంటల వరకు అక్షర విద్యాలయాన్ని ఉపరాష్ట్రపతితో పాటుగా గవర్నర్ సందర్శిస్తారు. అక్కడి నుంచి దీన్‌దయాళ్ అంత్యోదయ భవన్‌కు చేరుకుని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 9:55 గంటలకు స్వర్ణభారత్ ట్రస్ట్‌లో వివిధ కార్యక్రమాలకు హాజరవుతారు. 12:30 గంటలకు ఉపరాష్ట్రపతి అక్షర విద్యాలయం చేరుకుని భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 వరకు నెల్లూరు నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో జరగనున్న విక్రమసింహపురి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు వెంకటాచలం రైల్వేస్టేషన్ చేరుకుని ప్రత్యేక రైల్లో చెన్నైకి పయనమవుతారు.
భద్రతా వలయంలో వెంకటాచలం
ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పర్యటన నేపథ్యంలో వెంకటాచలంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వెంకటాచలం రైల్వేస్టేషన్, స్వర్ణభారత్‌ట్రస్ట్, సరస్వతీనగర్, అక్షర విద్యాలయం తదితర ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. పర్యటన ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. వెంకటాచలం రైల్వేస్టేషన్‌ను రంగులతో ముస్తాబు చేశారు.
అప్రమత్తంగా ఉండాలి – సిబ్బందికి ఎస్పీ సూచన
నెల్లూరు(క్రైమ్) : ఉపరాష్ట్రపతి పర్యటనలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ భాస్కర్‌భూషణ్ సిబ్బందికి సూచించారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పర్యటించనున్న ప్రాంతాలను ఆదివారం ఉదయం నుంచే పోలీసులు తమ ఆ«దీనంలోకి తీసుకున్నారు. అడుగడుగునా బాంబ్, డాగ్‌స్కా్వడ్‌లు తనిఖీలు నిర్వహించాయి. బందోబస్తు విధుల్లో ఉన్న సిబ్బందితో ఎస్పీ ఆదివారం సమావేశం నిర్వహించారు.
సిబ్బందికి సూచనలిస్తున్న ఎస్పీ భాస్కర్‌భూషణ్
స్థానిక పోలీసు కవాతు మైదానంలో కస్తూర్బా కళాక్షేత్రం, సరస్వతీనగర్‌లో బందోబస్తు విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. సిబ్బంది ప్రతి ఒక్కరూ విధిగా ఐడీకార్డులు, డ్యూటీ పాస్‌లు కల్గి ఉండాలని తెలిపారు. వీవీఐపీలు పర్యటించే సమయంలో అటుగా వాహనాల రాకపోకలను నిషేధించాలని పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ ఆధ్వర్వంలో ట్రయల్ కాన్వాయ్ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్పీ క్రైమ్స్ పి.మనోహర్‌రావు, డీఎస్పీలు కోటారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, మగ్బుల్, మల్లికార్జున, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.