భైంసా/బాసర, న్యూస్‌లైన్ :‘మేము ఎంతో దూరం నుంచి వచ్చాం. అమ్మవారిని దర్శించుకునేందుకు లైన్‌లో ఉంటే దొబ్బేస్తున్నారు. పక్కద్వారం నుంచి ఎవరినో తీసుకువచ్చి ప్రశాంతంగా పూజలు చేయిస్తున్నారు. మాలాంటి సామాన్య భక్తులు గంటల తరబడి లైన్‌లో నిలబడలేక ఇబ్బంది పడుతున్నాం’. అంటూ నల్గొండ జిల్లా నేరేడిపల్లికి చెందిన బుద్దారెడ్డి అమ్మవారి దర్శనం అనంతరం తీవ్రం అసంతృప్తి వ్యక్తం చేశాడు. చదువుల తల్లి కొలువైన బాసర క్షేత్రంలో సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం గగనమవుతోంది. ఉత్సవాలు నిర్వహించే ప్రతీసారి ఇక్కడి సిబ్బంది వీఐపీల సేవలో తరించడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. దర్శనం కోసం వచ్చిన భక్తులకు సౌకర్యాలు లేక, కనీసం మంచి నీళ్లు దొరకక అసహానానికి గురవుతున్నారు.
పిల్లల రోధనలు.. శుక్రవారం వేకువజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరి కనిపించారు. ఈయేడాది భక్తులు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ ఏర్పాట్లు చేయడంలో సిబ్బంది విఫలమయ్యారు. క్యూలైన్లలో చంటిపాపలు, పిల్లల రోధనలు ప్రతిధ్వనించినా వారిని పక్క నుంచి పంపలేకపోతున్నారు. వయస్సు మీద పడ్డవారు నిలబడలేక వరుసల్లో నుంచి బయటకు వచ్చారు. లోపలికి వెళ్లి గంటల తరబడి నిలబడలేక ప్రాంగణంలోనే అమ్మవారిని మొక్కుకున్నారు. చాలా మంది పిల్లలు లైన్‌లో దాహం అంటూ ఏడుస్తూ కనిపించారు. బాసర క్షేత్రానికి పాదయాత్రగా వచ్చే భక్తులను ప్రత్యేక దర్శనానికి అనుమతించడం లేదు. ఎంతో దూరం నుంచి పాదయాత్రగా వచ్చిన వారు కూడా అందరితో కలిసి గంటల తరబడి నిలబడ్డాకే అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. వీఐపీలకే ప్రాధాన్యం శుక్రవారం అమ్మవారి మూలనక్షత్రం కావడంతో అక్కడికి వచ్చే వారిలో వీఐపీలకే ఎక్కువ ప్రాధాన్యం కనిపించింది. తూర్పు ద్వారం నుంచి వారిని అనుమతించారు. ఇలా వీఐపీల రాకతో సామాన్య భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. మూలనక్షత్రం కావడంతో రెండు రోజుల నుంచి ఆలయ సిబ్బంది సామాన్యులకు వసతి అతిథి గృహాలను కూడా కేటాయించడం లేదు. ముందుగానే గదులన్ని బుకింగ్ అయ్యాయని సమాధానం ఇస్తున్నారు. ప్రైవేటు లాడ్జిలకు వె ళ్లాలంటూ భక్తులకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. తొక్కేస్తున్నారు..
సామాన్య భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు టెంకాయలు, పసుపు, కుంకుమ అగర్‌బత్తులు పవిత్రంగా తీసుకువస్తారు. ఎంతో భక్తిశ్రద్ధలతో తీసుకువచ్చే సామాన్యుల పసుపు, కుంకుమలు, అగర్‌బత్తులు,టెంకాయ లు కొట్టే స్థలంలో కాళ్ల కింద తొక్కేస్తున్నారు. దీంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నా యి. పవిత్రమైన పసుపు, కుంకుమలను హిం దూ సంప్రదాయ ప్రకారం పక్కన పెద్ద పాత్రలు ఉంచి అందులో వేయాలి. అయినా ఆలయ సిబ్బంది ఇవేమి పట్టించుకోవడం లేదు. బోర్డులకే పరిమితం...
ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఇక్కట్లు తలెత్తకుండా నో పార్కింగ్ బోర్డు ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారం వద్ద నోపార్కింగ్ బోర్డును పక్కన పారేసి ద్విచక్రవాహనాలను నిలిపి ఉంచుతున్నారు. బస్సులు ఎక్కే ప్రాంతంలో నీరు నిలిచినా శుభ్రం చేయడం లేదు. ఇక భక్తులు ఎక్కువగా వచ్చే రోజుల్లోనూ ఆలయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత సేవలు రైల్వే సమయాలకు అనుకూలంగా అందిస్తున్నారు. శుక్రవారం భక్తుల తాకిడి అధికంగా ఉన్నప్పటికీ ఈ బస్సును వినియోగించలేదు. ఒక పక్క వర్షం కురుస్తున్నా మధ్యాహ్నం సమయంలో ఈ బస్సును పార్కింగ్ స్థలంలోనే నిలిపివేశారు. దీంతో వర్షంలోనే తడుస్తూ భక్తులు వెళ్లాల్సి వచ్చింది. స్నాన ఘట్టాల వద్ద...
ఇక స్నాన ఘట్టాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో ప్రతియేటా బాసరకు లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. స్నాన ఘట్టాల వద్ద ఉన్న షెడ్ల పైకప్పులు తుప్పుపట్టినా కొత్తవి ఏర్పాటు చేయలేదు. పైకప్పు లేక వర్షానికి భక్తులు తడవాల్సి వచ్చింది. ఇక గంగమ్మ తల్లికి ఇక్కడికి వచ్చే భక్తులంతా నైవేద్యం సమర్పిస్తారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి వంటలు చేసేందుకు స్థలం లేక బట్టలు మార్చుకునే గది గోడకు ఆనుకుని నైవేద్యాలు వండుతూ మహిళా భక్తులు ఇబ్బందులు పడ్డారు. మందు బాబుల జల్సాలు...
పవిత్ర గోదావరి నది ఒడ్డున మందుబాబుల జల్సాలు కొనసాగుతున్నాయి. స్నాన ఘట్టాల వద్ద మహిళలు బట్టలు మార్చుకునేందుకు గదిని నిర్మించారు. ఈ గది స్లాబుపైకి ఎక్కితే తాగిపారేసిన ఖాళీ బీరు సీసాలు కనిపించాయి. గంగమ్మ తల్లి పక్కనే మందుబాబులు జల్సాలు చేసుకుంటున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఆగడాలు కొనసాగుతున్నా సిబ్బంది, ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇలా స్నాన ఘట్టాలే మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి. పట్టించుకోవడం లేదు బాసరకు వచ్చే సామాన్య భక్తులను ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఏది కొందామన్న అన్ని రెట్టింపు ధరలే. కనీసం అమ్మవారిని దర్శించుకుందామన్న ఆ కోరిక తీరడం లేదు. ఎంతో భక్తితో ఇక్కడికి వస్తే మాలాంటి సామాన్యులను పట్టించుకోవడం లేదు. ఏర్పాట్లలో ఆలయ అధికారులు విఫలమయ్యారు. కనీసం చంటి పాపలతో వచ్చిన మహిళలు, వృద్ధులను కూడా లోపలికి అనుమతించడం లేదు.
- ధర్మారెడ్డి, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా
బాసరలో వీఐపీలకే పెద్దపీట
Published Sat, Oct 12 2013 3:16 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM
Advertisement
Advertisement