విశాఖ వీధుల్లో కరోనా వైరెస్ నివారణ కోసం మందులు చల్లుతున్న జీవీఎంసీ సిబ్బంది
సాక్షి, విశాఖపట్నం/గన్నవరం/వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ)/నెల్లూరు అర్బన్: విశాఖలో కోవిడ్ బారినపడిన వృద్ధుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ శుక్రవారం స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన ఆ వృద్ధుడికి గురువారం కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆయన నివాసం ఉంటున్న అల్లిపురం ప్రాంతం మొత్తాన్ని వైద్యారోగ్య శాఖ తమ ఆధీనంలోకి తీసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచే అల్లిపురం వివేకానంద కాలనీలో బ్లీచింగ్, ఫాగింగ్ పనులు చేపట్టారు. వార్డు వలంటీరు, ఏఎన్‌ఎం, ఆశావర్కర్ ఒక టీమ్‌గా మొత్తం 141 బృందాల్ని ఏర్పాటు చేశారు. బాధితుడి సన్నిహితులు 11 మందిని క్వారంటైన్‌కు తరలించారు.
ఫ్రాన్స్ నుంచి వచ్చిన విద్యార్థిని హైదరాబాద్‌కు తరలింపు
ఫ్రాన్స్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఓ విద్యార్థినిని కోవిడ్ వైద్య పరీక్షల అనంతరం శుక్రవారం అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్‌కు చెందిన సంజనారాజ్ ఉన్నత చదువుల నిమిత్తం ఫ్రాన్స్‌కు వెళ్లింది. కృష్ణా జిల్లాలోని సన్నిహితుల ఇంటికి వెళ్లేందుకు ఎయిరిండియా విమానంలో 19వ తేదీ రాత్రి గన్నవరం చేరుకుంది. విమానాశ్రయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ యువతితోపాటు ఇతర దేశాల నుంచి వచ్చిన మరో ఐదుగురు విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. వీరికి వైరస్ లక్షణాలు నిర్ధారణ కానప్పటికీ ఇంటర్నేషనల్ టెర్మినల్‌లోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. స్వీయ గృహ నిర్బంధంలో ఉండేందుకు ఐదుగురిని అంబులెన్స్‌లో వారి స్వస్థలాలకు పంపారు. అలాగే విజయవాడ పాతబస్తీకి చెందిన హేమంత్ (23) ఉన్నత విద్య అభ్యసించేందుకు ఏడాది క్రితం పారిస్ వెళ్లాడు. కోవిడ్ ప్రభావంతో ఈ నెల 16న విజయవాడ వచ్చాడు. రెండు రోజులుగా అతడు జ్వరంతో బాధపడుతుండటంతో వైద్యులు అతడిని శుక్రవారం ఆస్పత్రికి తరలించారు.
అబుదాబి నుంచి వచ్చిన ఆరుగురు నెల్లూరు ఆస్పత్రికి తరలింపు
కాగా, అబుదాబి (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) నుంచి శుక్రవారం చెన్నై ఎయిర్‌పోర్టుకు, అక్కడ నుంచి నెల్లూరు చేరుకున్న ఆరుగురిని పరీక్షల నిమిత్తం అధికారులు సర్వజనాస్పత్రికి తరలించారు. వీరంతా ఉభయగోదావరి, విశాఖ జిల్లాలకు చెందినవారు.
Comments
Please login to add a commentAdd a comment