సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికలకు ఫిబ్రవరి నెలాఖరు కల్లా ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 20లోగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను రాష్ట్ర ప్రభుత్వం ముగించనుంది. 2009లో మార్చి తొలి వారంలోనే ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. ఇప్పుడు ఒక వారం ముందుగానే షెడ్యూల్ ప్రకటించవచ్చనే సమాచారం రాష్ట్రానికి ఉంది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2014-15) ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరిలో నిర్వహించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఫిబ్రవరిలో ఏ తేదీల మధ్య ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలో ఖరారు చేయాల్సిందిగా ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఫైలు ద్వారా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరారు.
ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు అసెంబ్లీ సమావేశాల ఆరు పనిదినాలుంటే సరిపోతుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5 నుంచి 20లోగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ముగించవచ్చునని అధికార వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్నందున నాలుగు లేదా ఆరు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది.
ఎన్నికల అనంతరం ఏర్పాటైన ప్రభుత్వం ప్రాధాన్యాలకు అనుగుణంగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రస్తుత సంవత్సరం కేటాయింపులనే నాలుగు లేదా ఆరు నెలలకు పొందుపరుస్తారు. దీనికి ఆర్థిక మంత్రి వివిధ శాఖల మంత్రులతో సమావేశాలను ఏర్పాటు చేసి ప్రాధాన్యతలను తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అయినా ఆర్థిక మంత్రి జనవరి 2 నుంచి 10 వరకు వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో బడ్జెట్‌పై సమావేశాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై సమావేశాలు జరగవనే విషయాన్ని అధికారులు ఆనం దృష్టికి తీసుకువెళ్లి ఉండరని, దాంతో ఆయన సమావేశాలను ఏర్పాటు చేశారనే అభిప్రాయం ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.