బోగస్ ఓటర్లకు చెక్ పెట్టేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. ఎన్నికల సమయంలో బోగస్ ఓట్లతో అనేక సమస్యలు తలెత్తుతుండటంతో వాటిని శాశ్వతంగా తొలగించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.
నెల్లూరు(రెవెన్యూ): బోగస్ ఓటర్లకు చెక్ పెట్టేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. ఎన్నికల సమయంలో బోగస్ ఓట్లతో అనేక సమస్యలు తలెత్తుతుండటంతో వాటిని శాశ్వతంగా తొలగించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఓటరు కార్డులకు ఆధార్ సీడింగ్ చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఓటరు కార్డుల ఆధార్ సీడింగ్ ప్రక్రియ మార్చి 1 నుంచి జిల్లాలో ప్రారంభించి 31వ తేదీలోపు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని ఎన్నికల కమిషన్ శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా అధికారులకు సూచనలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో బోగస్ ఓటర్లు కీలకపాత్ర పోషించేవారు. అభ్యర్థుల జయపజయాలు వారిపై ఆధారపడి ఉండేవి.
బోగస్ ఓటర్లను కట్టడి చేయడం అధికారులకు తలనొప్పిగా ఉండేది. అసలు ఓటర్లు ఎవరో బోగస్ ఓటర్లు ఎవరో కనిపెట్టడంలో అధికార యంత్రాగం ప్రతి ఎన్నికలోనూ విఫలమైంది. ఓటర్ల ఆధార్ సీడింగ్ వల్ల బోగస్, మరణించిన, స్థానికంగా నివాసంలేని, డబుల్ ఎంట్రీ ఓటర్లను రద్దు చేయవచ్చు. నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల ఆధార్ సీడింగ్‌తో ఎన్నికల కమిషన్ మంచి ఫలితాలను సాధించింది. నిజామాబాద్ జిల్లాలో 18 లక్షల ఓటర్లు ఉన్నారు. ఆధార్ సీడింగ్ తర్వాత 4 లక్షల ఓటర్లు జిల్లాలో లేరని నిర్ధారించుకుని వాటిని తొలగించారు. 60 వేలమంది మరణించన వారు, 40 వేలమంది డబుల్ ఎంట్రీ ఓటర్లను తొలగించారు. ఈ ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేలా ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. జిల్లాలో 22,78,313 మంది ఓటర్లు ఉన్నారు.
వారిలో 11,27,128 మంది పురుషులు, 11,50,887 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. మార్చి 1 నుంచి ఓటర్ ఆధార్ సీడింగ్ ప్రారంభించనున్నారు. ఓటర్లు తమ ఆధార్ నంబర్ తదితర పూర్తి వివరాలను ఎన్నికల కమిషన్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా పంపవచ్చు. లేదా ఆన్‌లైన్, కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి ఓటర్ ఐడీ నంబర్, ఆధార్ నంబర్ చెప్పిన అక్కడ ఉన్న సిబ్బంది వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. పోలింగ్ బూత్ స్థాయిలో సిబ్బందిని నియమించి ఓటర్ల ఆధార్ నంబర్లు సేకరిస్తారు. ఆధార్ సీడింగ్ ప్రక్రియకు సంబంధించి బూత్ లెవల్ ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఓటర్ల తమ ఆధార్ నంబర్ సీడింగ్ చేసుకోకపోతే దానిని తొలగిస్తారు. మరలా తిరిగి ఓటు నమోదు చేసుకోవడానికి కొంతకాలం జాప్యం జరుగుతుంది. ఓటర్ ఆధార్ సీడింగ్‌పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేలా జిల్లా యంత్రాగం చర్యలు చేపట్టనుంది.