ఓటర్లు జాబితా సవరణ ఈనెల 18 నుంచి వచ్చే ఏడాది జనవరి 16 వరకు కొనసాగుతుంది. జిల్లాలో 3వేల 38 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
ఏలూరు, న్యూస్‌లైన్ :
ఓటర్లు జాబితా సవరణ ఈనెల 18 నుంచి వచ్చే ఏడాది జనవరి 16 వరకు కొనసాగుతుంది. జిల్లాలో 3వేల 38 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 18న ముసాయిదా ఓటర్ల జాబితాలు ప్రకటిస్తారు. ఈ నెలాఖరులోగా జాబితాలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జాబితాలో పేరు లేని వారు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలోనే గ్రామసభల నిర్వహణ, రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాల స్వీకరణ చేస్తారు. ఈ నెల 24న, వచ్చేనెల 1, 8 ఆదివారాల్లో ప్రత్యేకంగా రాజకీయ పార్టీల నుంచి దరఖాస్తులను, అభ్యంతరాలను అధికారులు స్వీకరించనున్నారు. ఓటరు గుర్తింపు కార్డు ఉంటే సరిపోదు, ఓటర్ల జాబితాలో పేరుంటేనే ఓటు వేసే అవకాశం లభిస్తుంది.
ఓటర్ల జాబితాలో పేరు ఉందోలేదో పోలింగ్ స్టేషన్ల వారీగా చూసుకోవటానికి సీఈవో ఆంధ్రా ఎన్‌ఐసీ. ఇన్ వెబ్‌సైట్‌లోకీ వెళ్లవచ్చు.ఓటరుగా నమోదుకు అర్హతలు ఇవి.. 2014, జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండి, భారతదేశంలో నివసించే భారతీయ పౌరులంతా ఓటరుగా నమోదు కావటానికి అర్హులే. మానసిక వికలాంగులకు, ఎన్నికల నేరాలకు పాల్పడి శిక్ష పడిన (నిర్ణీత నేరాల్లో) వ్యక్తులకు ఓటర్‌గా నమోదయ్యేందుకు అర్హత లేదు. ఒక్క పోలింగ్ బూత్ పరిధిలో మాత్రమే ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ పోలింగ్ బూత్‌ల పరిధిలో ఓటు హక్కు ఉండటం చట్టరీత్యా నేరం.
ఓటరుగా నమోదుకు ఫారం 6ను పూర్తిగా నింపి, వయసు, నివాస ధ్రువీకరణ పత్రాలను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఈఆర్‌వో)కు సమర్పించాలి.
ప్రవాస భారతీయులు కూడా ఫారం 6లోనే ఓటు హక్కు కోసం సంబంధిత ఈఆర్వోకు దరఖాస్తు చేసుకోవాలి. వేరే ప్రాంతానికి మకాం మారితే అక్కడ కొత్త ఓటర్‌గా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
చనిపోయిన వ్యక్తులు, బోగస్ ఓటర్లకు సంబంధించిన అభ్యంతరాలను ఫారం 7లో ఈఆర్‌వోకు అందజేయాలి. రెండు చోట్లు ఓటు ఉన్న వారు కూడా ఫారం 7 ద్వారా ఓ ప్రాంతంలో ఓటు రద్దు చేసుకోవచ్చు. తమ వివరాలు ఎన్నికల జాబితాలో నమోదైన తర్వాత, వాటిలో తప్పులు ఉంటే ‘ఫారం 8 ఇచ్చి వాటిని సరిదిద్దుకోవచ్చు. పేరు, ఇంటిపేరు, తండ్రిపేరు, వయసు ఇలాంటి వివరాల్లో తప్పుల సవరణకు ఆధారాలు జతచేయాలి.
ఒకే అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఓ పోలింగ్‌బూత్ నుంచి మరో బూత్‌కు ఓటు హక్కును మార్చుకోవాల్సిన సందర్భంలో ఫారం 8ఎ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ ఫారాలన్నీ ఆన్‌లైన్ ద్వారా కూడా ఈఆర్వోకు సమర్పించవచ్చు. సీఈవో ఆంధ్రా ఎన్‌ఐసీ. ఇన్ వెబ్‌సైట్‌లోని సంబంధిత ఫారంలో వివరాలన్నీ పూర్తి చేసి, ఫొటో, ఇతర డాక్యుమెంట్లను స్కాన్ చేసి పంపిస్తే నిర్ణీత వ్యవధిలో ఓటు హక్కు కల్పిస్తారు. ఈ సేవా కేంద్రానికి వెళ్లి ఎపిక్ నంబర్ తెలియజేసి ఓటరు గుర్తింపు కార్డు పొందవచ్చు.