నరసన్నపేట: నరసన్నపేట మండలంలోని పది పంచా యతీలు, మూడు రెవెన్యూ క్లస్టర్లకు పదేళ్లుగా వీఆర్‌ఓగా పనిచేస్తున్న ముద్దాడ నర్సింగరావు (59) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఎంతో నిబద్ధతతో పని చేసే నర్సింగరావు ఇలా అనుమానాస్పద రీతిలో కన్ను మూయడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి ఆచూకీ లేకుండా పోయిన నర్సింగరావు మంగళవారం ఉదయం ముషిడిగట్టు పంచాయతీ పరిధిలోని ఉప్పరిపేట సమీపంలో ఉన్న జీడితోటల్లో విగతజీవిగా కనిపించారు. మృతదేహానికి సమీపంలో ఓ పురుగు మందు సీసాను పోలీసులు గుర్తించారు. సోమవారం సాయంత్రమే ఆయన చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే మృతదేహం తల వెనుక భాగంలో రక్తం ఉండడం, పురుగు మందు తాగినా అక్కడ గింజుకున్న ఆనవాళ్లు లేకపోవడంపై ఆయన కుటుంబ సభ్యులు అనుమా నం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో ఆయన ఎప్పుడు రాలేదని స్థానికులంటున్నారు.
సోమవారం మధ్యాహ్నం నుంచే..
సోమవారం ఉదయం రోజూ మారిదిగానే లుకలాం చేసుకున్న వీఆర్వో మధ్యాహ్నం వరకు ఉర్లాం పరిసరాల్లోనే ఉన్నారు. అయితే సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన బీఎల్‌ఓల సమావేశానికి హాజరు కాలేదు. ఆర్‌ఐ కోటేశ్వరరావు, తహసీల్దార్ రామారావులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. రాత్రి 8 గంటలైనా ఇంటికి రాకపోవడంతో అమ్మ ఫోన్ చేసిందని, అప్పుడు కూడా కాల్ వెళ్లలేదని కుమారుడు కిరణ్‌కుమార్ తెలిపారు. ఉదయం ఈ వార్త విని అవాక్కయ్యాయని ఆయన విలేకరుల ముందు కన్నీరుమున్నీరయ్యారు.
అనుమానాలెన్నో..
నర్సింగరావు ఇంటిలో ఎలాంటి వివాదాలు లేవు. విధి నిర్వహణలోనూ పక్కాగా ఉండేవారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కచ్చితంగా ఎవరో చం పేసి పడేసి ఉంటారని అన్నదమ్ములు రామ్మోహన్, సింహాచలం, ఆటకేశంలు అనుమానం వ్య క్తం చేస్తున్నారు. ఏ రాత్రికో ఇంటికి వచ్చేవారని, ఉదయానికే డ్యూటీకి వెళ్లిపోయేవారని వారు తెలి పారు. ఇసుక తవ్వకాలపై అధికారులు, నాయకుల మధ్య నలిగిపోయేవాడని చెప్పారు.
పని చేయలేకపోతున్నానంటూ లేఖ..
ఘటనా స్థలంలో మృతుని జేబు నుంచి పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. పని ఒత్తిడి అధికంగా ఉంది. ఆరోగ్యం సహకరించడం లేదు. తనను విధుల నుంచి తప్పించాలని అందులో ఉన్నట్లు సమాచారం. తన రాజీనామాను ఆమోదించాలని లేఖలో అభ్యర్థించినట్లు తెలుస్తోంది. ఈ ఉత్తరం ఈ నెల 6వ తేదీన రాసినట్లు ఉంది. అధికారుల వేధింపులు కూడా మరణానికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.
సంఘటనా స్థలాన్ని ఏఎస్పీ పనసారెడ్డి, ఆర్డీఓ ఎంవీ రమణ, డీఎస్పీ వీ.భీమారావు, నరసన్నపేట సీఐ జీ. శ్రీనివాసరావు, ఎస్‌ఐ జి. నారాయణ స్వామి, తహసీల్దార్ జల్లేపల్లి రామారావు తదితర అధికారులు పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు.
అనుమానాస్పద కేసుగానే నమోదు
నరసన్నపేట: చోడవరం వీఆర్వో ముద్దాడ నర్సింగరావు మృతిని అనుమానాస్పద కేసుగానే నమోదు చేశామని నరసన్నపేట సీఐ జి.శ్రీనివాసరావు తెలిపారు. పోస్టుమార్టం పూర్తయ్యిందని, రిపోర్టు వస్తే పూర్తి సమాచారం తెలుస్తుందన్నారు. ప్రాథమికంగా తమకు లభించిన ఆధారాల ప్రకారం ఆత్మహత్యగానే భావిస్తున్నామని, పూర్తి వివరాలు అందాక ఓ నిర్ధారణకు వస్తామని చెప్పారు.
సింగుపురంలో విషాద ఛాయలు
శ్రీకాకుళం రూరల్: మండలంలోని స్థానిక సింగుపురంలో నివాసం ఉంటున్న ముద్దాడ నర్సింగరావు (58) మృతి చెందడంతో సింగుపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీఆర్‌ఓగా పనిచేస్తున్న నర్సింగరావుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అందరితో మంచిగా మెలిగేవారు. పదిహేనేళ్లుగా శ్రీకాకుళం మండలంలోనే వీఆర్వోగా పని చేసిన అనుభవం ఉంది. ఈయనకు ముగ్గురు అన్నదమ్ముల్లో పెద్దన్నయ్య ముద్దాడ రామ్మోహన్ సింగుపురంలోనే ఓ స్కూల్ నిర్వహిస్తుండగా, మరో తమ్ముడు సింహాచలం శ్రీకాకుళంలోనే వైద్యునిగా పనిచేస్తున్నట్లు సమాచారం.
పని ఒత్తిడి అధికంగా ఉంది
మంచి వీఆర్వో చనిపోయాడు. ఈయన మృతికి కేవలం పని ఒత్తిడే కారణం. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. మాలాంటి వారికి ఎంతగానో ధైర్యం చెప్పేవాడు. ఏళ్ల తరబడి వీఆర్వోగానే ఉండిపోయాను, ప్రమోషన్ రాలేని బాధ పడేవారు. ఓ వీఆర్వో ఇలా చనిపోతాడని అనుకోలేదు. మూడు రోజుల కిందటే రెండు ఇసుక లారీలు పట్టుకున్నాడు.
– ప్రగడ వేణుగోపాల్, వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment