అనంతపురం సెంట్రల్: జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డీపీఓ నుంచి లావాదేవీలు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో చిన్నస్థాయి పోలీసు ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. వివరాల్లోకి వెళితే... ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు... పోలీసుల ఉద్యోగుల విధులకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఏ సమయంలో ఎక్కడికి బందోబస్తు పోవాలో కూడా తెలియని పరిస్థితి. ఒక్కోసారి 10 నుంచి 15 రోజులపాటు బందోబస్తు వెళ్లే ఏఆర్ పోలీసులు కూడా ఉన్నారు. ఇలాంటి వారికి కూడా వేతనాలు రాకపోవడంతో ఆ కుటుంబాలు ఇబ్బందులు వర్ణనాతీతం.
3700 మందికి ఇబ్బందులు..
జిల్లా వ్యాప్తంగా కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్‌ఐ, ఎస్‌ఐ, సీఐలకు జనవరి నెల వేతనాలు రాలేదు. దాదాపు 3700 మంది ఉద్యోగులు జీతాలు, టీఏలు, డీఏలు, అడిషనల్ సరండర్‌పే బిల్లు్లలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక కారణాలు సాకుగా చూపి జిల్లా పోలీసు అధికారులు తప్పించుకుంటున్నారు. అసలు కారణాలు జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకురాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్‌ఐ, సీఐ స్థాయి ఉద్యోగులు ఎలాగోలా నెట్టుకొస్తున్నా చిన్న స్థాయి ఉద్యోగులకు కష్టాలు తప్పడం లేదు. ఇంటి అద్దెలు, ఖర్చులు చెల్లించలేక అవస్థలు పడుతున్నామని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీలోగా వచ్చే జీతాలు ఈ సారి ఆగిపోవడంతో దిక్కుతోచడం లేదు. దీంతో పాటు పోలీసు ఉద్యోగులకు 15 రోజులకు సంబంధించి సరండర్‌పే వేతనాలు జనవరిలోనే మంజూరు కావాల్సి ఉంది. అయితే ఇంత వరకూ చెల్లించలేదు. దీంతో పాటు ఇతర ప్రాంతాలకు చేతి నుంచి డబ్బు పెట్టుకొని బందోబస్తు ముగించుకు వచ్చిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసు కార్యాలయంలో కొంతమంది సిబ్బంది సమస్యల విషయంలో పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసు నిధులు దారి మళ్లించారా.?
ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొత్తకొత్తగా హామీలు గుప్పించారు. ఈక్రమంలో పింఛన్ల పెంపు, డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు ఇస్తానని ప్రకటించడంతోపాటు కొంత సొమ్ము కూడా అందజేశారు. ఈ నేపథ్యంలో ఖజానా విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. ఉద్యోగుల జీతభత్యాలు, ఇతరత్రా బిల్లులన్నీ నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఖజానాలో రూ.వందల కోట్లు బిల్లులు ఆగిపోయినట్లు సమాచారం. ఎన్నికల నేపథ్యంలో ప్రజలు, డ్వాక్రా మహిళలకు ఎరవేసేందుకు ప్రభుత్వం ఉద్యోగుల డబ్బును దారి మళ్లించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే పోలీసులతో సహా పలు శాఖల ఉద్యోగుల జీతభత్యాలు, బిల్లులు మంజూరుకావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
త్వరలో వేతనాలుఖాతాల్లో జమ
సిబ్బందికి వేతనాలు రాని విషయం వాస్తవమే. ఇందుకు సంబంధించిన సమస్య పరిష్కారమైంది. త్వరలో సిబ్బంది ఖాతాల్లో వేతనాలు జమవుతాయి.– జీవీజీ అశోక్‌కుమార్,జిల్లా ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment