
తక్షణమే రుణమాఫీ అమలుచేయాలి
పలాస : టీడీపీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొనట్లు రుణమాఫీ తక్షణమే అమలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేసింది. పలాసలోని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో బుధవారం అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షురాలు పైల చంద్రమ్మ అధ్యక్షతన జిల్లా కార్యవర్గం సమావేశం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వి.మాధవరావు మాట్లాడుతూ ప్రభుత్వం షరతులు లేని రుణమాఫీని అమలు చేసి కొత్త రుణాలను అందజేయాలన్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతోందని, వ్యవసాయ పెట్టుబడులకు, పరికరాలకు రుణాలు అవసరమన్నారు. జిల్లా రైతాంగానికి 70 వేల క్వింటాళ్ల వరివిత్తనాలు అవసరమని, 49 వేల క్వింటాళ్లే అవసరమని అధికారులు ప్రకటించారన్నారు. రైతులకు అవసరమైన అన్ని విత్తనాలను అందజేయాలని, బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గొరకల బాలకృష్ణ, వంకల పాపయ్య, రాపాక మాధవరావు, ఎస్.సోమేశ్వరరావు, ఎం.తాతారావు, కె.సోమేశ్వరరావు పాల్గొన్నారు.