ప్రమాద ఘంటికలు | water facility | Sakshi
Sakshi News home page

ప్రమాద ఘంటికలు

Published Fri, Mar 6 2015 2:51 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM

water facility

 అనంతపురం టౌన్: తాగునీటి సమస్య ఈసారి పట్టణాలనూ వదిలేటట్లు లేదు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరగడంతో రానున్న మూడు నెలల్లో నీటి సమస్య తీవ్రత గురించిన ఆందోళన వ్యక్తమవుతోంది. నీటి వనరులను సద్వినియోగించుకోవడంపై జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే వేసవిలో పట్టణ జనం గుక్కెడు నీటి కోసం అల్లాడాల్సిందే.   ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రజారోగ్య శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ నివేదిక పంపించారు. వేసవిలో నీటి ఎద్దడి నుంచి గట్టేందుకు ఏ మేరకు నీరు అవసరముందో తెలియజేస్తూ స్పష్టమైన ప్రతిపాదనలు ఇందులో ఉంచారు. వాటి అమలు దిశగా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటే చాలా వరకు సమస్య నుంచి గట్టెక్కవచ్చు.
 
 పీఏబీఆర్‌లో 0.727 టీఎంసీలు     నిల్వ చేయాలి
 జిల్లాలో అనంతపురం కార్పొరేషన్‌తో పాటు హిందూపురం, కళ్యాణదుర్గం, మడకశిర మునిసిపాలిటీలకు పెన్న అహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) నుంచి నీటిని ఇస్తున్నారు. ప్రస్తుత వేసవిలో ఆగస్టు వరకు నీటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే 0.727 టీఎంసీల నీటిని డ్యాంలో నిలువ చేయాలి. అనంతపురం కార్పొరేషన్‌కి పీఏబీఆర్ పైప్‌లైన్ ప్రాజెక్టు ద్వారా నీటిని ఇస్తుంటే, హిందూపురం, కళ్యాణదుర్గం, మడకశిర మునిసిపాలిటీలకు శ్రీరామిరెడ్డి ప్రాజెక్టు ద్వారా ఇస్తున్నారు. వేసవిలో అనంతపురం కార్పొరేషన్ అవసరాలకు0.508 టీఎంసీలు, హిందూపురం మునిసిపాలిటీకి 0.155 టీఎంసీలు, కళ్యాణదుర్గం మునిసిపాలిటీకి 0.042 టీఎంసీలు, మడకశిర మునిసిపాలిటీకి 0.022 టీఎంసీలు మొత్తం 0.727 టీఎంసీ నీరు అవసరం. ఈ మేరకు నీటిని పీఏబీఆర్‌లో నిలువ చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
 
 సీబీఆర్‌లో 0.640 టీఎంసీలు నిలువ చేయాలి
 ధర్మవరం, కదిరి, పుట్టపర్తి మునిసిపాలిటీలకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్) నుంచి నీటిని ఇస్తున్నారు. వేసవిలో ఆగస్టు వరకు ఈ ప్రాంతాల్లో నీటి అవసరాలకు 0.640 నీరు అవసరం అవుతుంది. ధర్మవరం మునిసిపాలిటీకి 0.323 టీఎంసీ, కదిరి మునిసిపాలిటీకి 0.236 టీంఎసీ, పుట్టపర్తి మునిసిపాలిటీకి 0.081 టీఎంసీ మొత్తం 0.640 టీఎంసీ నీరు అవసరమవుతుంది.
 
 పెన్నాకి రెండు టీఎంసీలు కావాలి
 పెన్నానదిలో బోర్లు ద్వారా తాడిపత్రి, పామిడి, గుత్తి మునిసిపాలిటీలకు నీటిని ఇస్తున్నారు. అయితే గత నాలుగేళ్లగా పెన్నా పూర్తిగా ఎండిపోవడంతో బోర్లలో నీరు లేదు. దీంతో ఈ ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. వేసవిలో ఈ సమస్య మరింత  ఉధృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి పంపిన నివేదికలో ఇదే విషయాన్ని ఈఎన్‌సీ ఉంచారు. ఈ సమస్యను అధిగమించాలంటే పెన్నా నదికి మిడ్ పెన్నార్ నుంచి రెండు టీ ఎంసీ నీటిని ఇవ్వాలి. ఈ నీటితో భూగర్భజలాల పెరిగి బోర్లు రిచార్జ్ అవుతాయి. తద్వారా నీటి ఎద్దడి తలెత్తకుండా చూడవచ్చని నివేదికలో పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement