7 జిల్లాల్లో వాటర్ గ్రిడ్
దశలవారీగా రాష్ట్ర ప్రజలందరికీ మంచినీరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రజలందరికీ వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీటి వసతి కల్పించాలన్న నిర్ణయంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో.. తొలి దశలో ఏడు జిల్లాల్లో వాటర్ గ్రిడ్ ఏర్పాటునకు పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి శాఖ అధికారులు కసరత్తు చేపట్టారు. తొలి దశలో అనంతపురం, చిత్తూరు, వైఎస్‌ఆర్ కడప, కర్నూలు, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీటి సౌకర్యం కల్పించనున్నారు.
ఈ జిల్లాల్లో తాగునీటికి, పరిశ్రమలకు సరఫరా చేసేందుకు 73.134 టీఎంసీలు అవసరమని లెక్కకట్టారు. ఏడు జిల్లాలకుగాను అనంతపురం జిల్లా వాటర్ గ్రిడ్‌కు మాత్రం సవివరమైన ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేశారు. దీనికి రూ.1,400 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. మిగతా ఆరు జిల్లాల్లో వాటర్ గ్రిడ్‌కు సవివరమైన ప్రాజెక్టు నివేదికలు తయారీ దశలో ఉన్నాయి. అనంతపురం జిల్లాకు పెన్నా అహోబిలం, తుంగభద్ర హైలెవల్ కెనాల్ ద్వారా నీటిని వాటర్ గ్రిడ్‌కు వినియోగించాలని ప్రతిపాదించారు.
అలాగే చిత్తూరు జిల్లాకు హంద్రీనీవా సుజల స్రవంతి, గండికోట ద్వారా నీటిని వాటర్ గ్రిడ్‌కు వినియోగించాలని నిర్ణయించారు. వైఎస్‌ఆర్ కడప జిల్లాలో గండికోట మైలవరం నీటిని, కర్నూలు జిల్లాలో శ్రీశైలం నీటిని వాటర్ గ్రిడ్‌కు వినియోగించాలని ప్రతిపాదించారు. నెల్లూరు జిల్లాకు సోమశిల, కండలేరు నీటిని, గుంటూరు, ప్రకాశం జిల్లాల వాటర్ గ్రిడ్‌కు కృష్ణా జలాలను వినియోగించాలని ప్రతిపాదనలు రూపొందించారు. ఇదిలా ఉండగా మొత్తం 13 జిల్లాలకు వాటర్ గ్రిడ్‌కు తాగునీటి, పరిశ్రమల అవసరాలకోసం 232.10 టీఎంసీలు అవసరమని అధికారులు తేల్చారు. ఇందులో 13 జిల్లాల పట్టణ, గ్రామీణ మంచినీటి అవసరాలకు 166.42 టీఎంసీలు, పరిశ్రమలకోసం 65.68 టీఎంసీలు అవసరమని లెక్కకట్టారు. నీటి అవసరాలను కూడా 2044 సంవత్సరం నాటికి పెరిగే జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని లెక్కకట్టారు. వాటర్ గ్రిడ్‌లకు జలాశయాల్లో నీటిని వినియోగించడానికి అవసరమైన అనుమతిని సాగునీటి శాఖ ఇవ్వాల్సి ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పట్టణాలు, గ్రామీణ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జనాభా పెరుగుదలను ఈ విధంగా అంచనా వేశారు.
20112014 10 శాతం జనాభా పెరుగుదల
20142024 9 శాతం జనాభా పెరుగుదల
20242034 8 శాతం జనాభా పెరుగుదల
20342044 7 శాతం జనాభా పెరుగుదల
తాగునీరు, పరిశ్రమలకు 73.134 టీఎంసీలు
13 జిల్లాలకు 232 టీఎంసీలు అవసరం
అనంతపురం వాటర్ గ్రిడ్‌కు 1,400 రూ. కోట్ల అంచనా