
జగన్ అడుగు జాడల్లో నడుస్తా
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి భరత్ స్పష్టం చేశారు.
చినగంజాం : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి భరత్ స్పష్టం చేశారు. సోమవారం రాత్రి స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అతి చిన్న వయసులో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆదరించిన జగన్‌మోహన్‌రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయనని, ఎప్పటికీ వైఎస్సార్ సీపీలోనే కొనసాగుతానని వివరించారు. తాను అమెరికా వెళ్తున్నట్లు ఎవరో కొందరు ప్రత్యర్థులు అసత్య ప్రచారం చేస్తున్నారని, కార్యకర్తలు ఎవరూ ఆ ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
గతంలో సమైక్యాంధ్ర కోసం తాను నిరాహార దీక్ష చేపట్టిన సమయంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు తనను ఆదరించారని సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. అన్ని గ్రామాల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఐదేళ్లలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ మండలాల వారీగా పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలా పని చేస్తానని భరత్ వివరించారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ కోట విజయభాస్కర్‌రెడ్డి, ఇటీవల పార్టీ తరఫున గెలుపొందిన 9 మంది ఎంపీటీసీ సభ్యులు, మండల, గ్రామ స్థాయి నాయకులు, సుమారు 300 మందిపైగా కార్యకర్తలు పాల్గొన్నారు.