కుమ్మక్కు రాజకీయాలు చేయం
నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం: గడికోట శ్రీకాంత్‌రెడ్డి
హైదరాబాద్: కుమ్మక్కు రాజకీయాలకు దూరంగా ఉంటూ నిజమైన ప్రతిపక్షంగా తమ పార్టీ వ్యవహరిస్తుందని, సమస్యలొచ్చినపుడు ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి చెందిన తరువాత రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు కుమ్మక్కై రాజకీయాలు చేశాయని, తాము అలా వ్యవహరించబోమని అన్నారు.
ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే నుంచి ప్రారంభమైన తమ బలం ఉప ఎన్నికల తరువాత ఇద్దరు ఎంపీలు, 20 మంది ఎమ్మెల్యేలకు పెరిగింద ని, అదిపుడు 70 మంది ఎమ్మెల్యేలకు పెరిగిందని, ఈ సంఖ్యతో ఒక బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని అన్నారు. పార్టీ సిటింగ్ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది ఓటమికి కారణం స్థానిక అంశాల ప్రభావమే తప్ప మరొకటి కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన తీర్పును తాము గౌరవిస్తున్నామని, కొత్త రాష్ట్రం పునర్నిర్మాణానికి ఏ రకంగా సహకరించాలో ఆ విధంగా ఉంటామని ఆయన పేర్కొన్నారు.