విభజనకు 2008లోనే ఓకే చెప్పాం: బాబు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర విభజనకు అనుకూలమని తాను 2008లోనే చెప్పానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అంగీకరించారు. అయితే, రెండు ప్రాంతాల వారికి న్యాయం చేయాలని తాము చెప్పామని.. కానీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధికోసం రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చిందని ధ్వజమెత్తారు. 42 రోజులుగా ప్రజలు పోరాటం చేస్తుంటే వారిని పిలిచి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. కృష్ణా జిల్లాలోని రెడ్డిగూడెం, ఎ.కొండూరు, గంపలగూడెం మండలాల్లో సోమ, మంగళవారాల్లో చంద్రబాబు పర్యటించారు.
ఈ సందర్భంగా పలుచోట్ల మాట్లాడుతూ.. ఇరు ప్రాంతాల్లోని ఉద్యోగ సంఘాలు, జేఏసీ నాయకులు, మేధావులు, పారిశ్రామికవేత్తలను కూర్చోబెట్టి మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సి ఉండగా.. సమస్యను కాంగ్రెస్ మరింత జటిలం చేసిందని ఆరోపించారు. సోనియాగాంధీ చేతిలో ప్రధాని మన్మోహన్‌సింగ్ కీలుబొమ్మ అని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి ప్రధానిని కలవటానికి వెళ్తే.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికి ఉంటే ఈ కష్టాలు వచ్చి ఉండేవి కాదని ప్రధాని అనటం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసమర్థుడని, ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా.. అక్కడో మాట ఇక్కడో మాట చెప్తారని ధ్వజమెత్తారు.
పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఉత్సవ విగ్రహమని, లిక్కర్ డాన్ అని రాష్ట్రం గురించి పట్టించుకోరని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైలులో దీక్షలు చేశారని, ఆయనను ఉస్మానియా, నిమ్స్‌కు తరలించారని, ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారని, ఇంటి భోజనాలు తెప్పించారని చంద్రబాబు అక్కసు వెళ్లగక్కారు. దేశంలో నాలుగుసార్లు కాంగ్రెసేతర ప్రభుత్వాలు వస్తే మూడుసార్లు టీడీపీ కీలక పాత్ర పోషించిదని.. తనను ప్రధానమంత్రి పదవి చేపట్టాలని కూడా కోరారని, అయితే రాష్ట్రంలో ఉండటం కోసం తాను తిరస్కరించానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్‌ఫోన్లు ఉండటం తన ఘనతేనని చెప్పుకున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లతో పాటు సైబర్‌బాద్‌ను ఏర్పాటుచేసి అభివృద్ధి చేశానన్నారు.