సీతమ్మధార : రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలని, మేయర్ పీఠాన్ని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోవడానికి ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ కోరారు. అక్కయ్యపాలెం షాదీఖానాలో సోమవారం ఉదయం వైఎస్సార్‌సీపీ ఉత్తర నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అమర్‌నాథ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో అధికారం కోల్పోయినా ప్రజలు, పార్టీ కార్యకర్తల సహకారంతో ప్రతిపక్ష నాయకుడి హోదాను పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. హుదూద్ తుపాను బాధితులను పరామర్శించేందుకు జగన్‌మోహనరెడ్డి జిల్లాలో ఆరురోజులు పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారన్నారు. తుపానులో మృతి చెందినవారి కుటుంబానికి పార్టీపరంగా రూ.50 వేల వంతున నష్టపరిహారం అందించామన్నారు.
తైనాల విజయకుమార్ మాట్లాడుతూ పార్టీలో జరిగిన ప్రతి చిన్నపొరపాటును కార్యకర్తలు, నాయకులు భూతద్దంలో చూసేకంటే దానిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటే పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం అవుతుందన్నారు. నియోజకవర్గంలోని వార్డు ముఖ్యనాయకులు, ప్రతి కార్యకర్త జీవీఎంసీ ఎన్నికలలో ఎక్కువ మంది కార్పొరేటర్లను గెలిపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు. త్వరలో వార్డు కమిటీలు, అనుబంధ సంఘాలు, బూత్‌స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
అనంతరం పార్టీ కార్యకలాపాలు, బలోపేతం వంటి విషయాలపై ముఖ్యనాయకులు, కార్యకర్తల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. సమావేశంలో రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకుడు ఫరూఖీ, నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, మాజీ కార్పొరేటర్లు జి.వి.రమణి, పామేటి బాబ్జీ, మువ్వల పోలారావు, సేనాపతి అప్పారావు, ఎ.వి.ఎస్.నాయుడు, కల్చరల్ విభాగం కన్వీనర్ రాధ, సనపల చంద్రమౌళి, షబ్నం అఫ్రోజ్, వివిధ వార్డుల ముఖ్యనాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.