సిద్దిపేట, న్యూస్‌లైన్: సిద్దిపేట కోమటిచెరువు నుంచి నర్సాపూర్ ఊర చెరువు వరకు వరద కాలువ నిర్మాణం ఓ పట్టాన పూర్తవడంలేదు. శాశ్వత ప్రాతిపదికన తలపెట్టిన కట్టడానికి అడుగడుగునా అవరోధాలు ఎదురవుతున్నాయి. దీంతో పనులు ముందుకు సాగడంలో ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పడంలేదు. పనుల్లో నెలకొన్న ప్రతిష్టంభనను అధిగమించడం సిద్దిపేట డివిజన్ నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ(ఐఅండ్‌సీఏడీ)కు సవాల్‌గా మారింది.
సిద్దిపేటలో ప్రశాంత్‌నగర్.. పట్టణంలోనే విస్తారమైన ఉనికిగలది. కొత్త బస్టాండ్-కోమటిచెరువు మధ్యలోని నిర్దేశిత ఏరియా.. దశాబ్దం కిందట వర్షాలూ.. వరదలతో ముంపునకు గురైంది. భవిష్యత్తులో అలాంటి దుస్థితి ఉత్పన్నం కావొద్దన్న ఉద్దేశంతో వరద కాలువ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని 2007లో నిర్ణయించారు. వాన, వరద నీరు ఆవాసాల చెంతన నిలువకుండానూ చిన్ననీటి వనరులకు తోడ్పాటుగానూ ఉండాలని ఆలోచించారు. దానికి ఉభయతారకమే ఫ్లడ్ ఫ్లో కెనాల్(వరద కాలువ)గా నిశ్చయించారు. ఆ క్రమంలోనే ఐఅండ్‌సీఏడీ రూ.1.23 కోట్లను కేటాయిస్తూ 2007 ఆగస్టు 21న ఉత్తర్వుచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఓ కాంట్రాక్టు సంస్థతో ఒప్పందం కుదిరింది. కాలువ మధ్యలో 15 మీటర్ల వెడల్పుతో రెండు వైపుల్లోనూ సిమెంట్ కాంక్రీట్ గోడల్ని 600 మీటర్ల మేర(సున్నా నుంచి 30వ గొలుసు వరకు) కట్టించారు.
రెండో విడత గోసగోస
ఎంచుకున్న ప్రాజెక్టు తొలి దఫాతో పూర్తవలేదు. అందుకే రెండో దఫాలో మిగతాది (30 నుంచి 76వ గొలుసు దాకా) సంపూర్ణం చేయాలని నిర్ణయించారు. ఈసారి రెండింతలకు పైగానే అంచనా వ్యయంగా లెక్కలేశారు. ఆ ప్రకారం రూ.3.07 కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. దానికి ఇరిగేషన్ డిపార్టుమెంటు 2012 మార్చి 6న జీఓ ఇస్తూ ప్రక్రియకు పచ్చజెండా ఊపింది. అదే వరుసలో హైదరాబాద్‌కు చెందిన మరో కాంట్రాక్టు సంస్థ పనులను దక్కించుకొంది. కానీ..ఈసారి నిర్మాణానికి వివాదాలు ముసురుకున్నాయి.
పరిహారం కోరుతూ కోర్టుకు...
తమ జాగాల్లోంచి కాలువ నిర్మాణాలు చేపట్టరాదని, ఒక వేళ అనివార్యమైతే పరిహారం ఇప్పించాలంటూ పలువురు హైకోర్టుకెళ్లారు. అలా తొమ్మిది కేసులు దాఖలయ్యాయి. సుమారు 70 మంది వరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. ఎక్కడైతే వివాదం లేదో అక్కడ యంత్రాలతో కాలువను తవ్విస్తూ సీసీ(సిమెంట్ కాంక్రీట్) గోడల్ని ఆ డిపార్టుమెంటు కట్టించింది. దీంతో అది కాస్తా ప్యాచ్ వర్కు మాదిరిగా అవతరించింది. అలా 40 శాతం వరకు లాక్కొచ్చారు. పని విలువను బట్టి దాదాపు రూ.1.20 కోట్లు కాంట్రాక్టు సంస్థకు చెల్లించారు. గత జూన్ నుంచి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
వివాదాలు సమసిన వెంటనే...
మొన్నటిదాకా వర్షాల కారణంగానూ మరో వైపు కోర్టు కేసుల వల్లనూ వరద కాలువ పనులు ఆగాయి. ప్రస్తు తం నెలకొన్న వివాదాలు సమసిన వెంటనే నిర్మాణాలను తిరిగి ప్రారంభిస్తాం. ఈ పనుల కారణంగా ఎవరికీ పరిహారం ఇచ్చే వెసులుబాటు శాఖాపరంగా లేదు.
-కేఎన్ ఆనంద్, ఈఈ, నీటి పారుదల శాఖ, సిద్దిపేట
‘వరద కాలువ’ పూర్తయ్యేదెన్నడో?
Published Thu, Oct 3 2013 12:21 AM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM
Advertisement