ఇవ్వాలా.. వద్దా!
సర్వే చేయిస్తున్నవారు టీడీపీ అధినేత?
- నివేదిక తర్వాతే నిర్ణయం
- సర్వేపై జిల్లాలో ఆసక్తికర చర్చ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇచ్చే వ్యవహారాన్ని ఒక సర్వే తేల్చనుందా? అదీ నంద్యాల ప్రజల అభిప్రాయాలపై ఆధారపడి ఉందా? ముఖ్యమంత్రి స్థాయిలో ఈ నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదా? అంటే అవుననే తెలుస్తోంది. ఇందుకు కారణం... నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలా... వద్దా... మీ అభిప్రాయం ఏమిటి? అంటూ అధికారపార్టీ ఏకంగా ఒక సర్వే చేయిస్తుండటమే ఉదాహరణ. బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ ద్వారా సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సర్వేపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాలుగైదు రోజుల్లో సర్వే పూర్తికానున్నట్టు సమాచారం. అనంతరం ఈ సర్వే నివేదిక ఆధారంగా అధికారపార్టీ అధినేత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, కేవలం సర్వే నివేదిక ఆధారంగానే మంత్రి పదవి నిర్ణయం జరుగుతుందా? ముందుగానే కుదిరిన ఒప్పందం మేరకు పదవి అప్పగిస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆది నుంచీ వివాదమే...!
వాస్తవానికి భూమా నాగిరెడ్డి అధికారపార్టీలో చేరిక మొదలు మంత్రి పదవి వ్యవహారం వరకూ అధికారపార్టీలో రోజుకో వివాదం రేగుతూనే ఉంది. మొదట్లో ఆయన రాకను శిల్పా సోదరులతో పాటు గంగుల వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. అయినప్పటికీ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చామంటూ చేరికలు జరిగిపోయాయి. అయితే, అప్పటి నుంచి ఇప్పటివరకు ఇరువర్గాల మధ్య అగ్గిరాజుకుంటూనే ఉంది. ఒకానొక సమయంలో బహిరంగంగానే విమర్శలు గుప్పించుకున్నారు. ఢీ అంటే ఢీ అని ఇరువర్గాలు సవాళ్లు కూడా విసురుకున్నాయి. అయితే, తాజాగా ఆ పార్టీ అధినేత ఎమ్మెల్యేలకే పట్టం అంటూ... నియోజకవర్గ ఇంచార్జీలను డమ్మీలను చేయడంతో మరోసారి పాత నేతలు భగ్గుమన్నారు. తాజాగా ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇంచార్జీ గంగుల ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. నంద్యాల నియోజకవర్గంలోనూ ఇదే అలజడి మొదలయ్యింది. ఆయనకు మంత్రి పదవి ఇస్తే వచ్చే ఉప ఎన్నికల్లో తాము స్వతంత్రంగానైనా పోటీ చేస్తామని శిల్పా వర్గీయులు సంకేతాలు పంపించారు. అంతేకాకుండా విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమావేశమై... తమకు జరుగుతున్న అవమానాలను వివరించారు. గతంలో కర్నూలులో జరిగిన సమన్వయ కమిటీ భేటీల్లోనూ ఇదే అంశాన్ని శిల్పా సోదరులు లేవనెత్తారు. తద్వారా భూమా దూకుడుకు కళ్లెం వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా ఇరు నేతల మధ్య ఆది నుంచీ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
సర్వేలో వ్యతిరేక ఫలితాలే...!
భూమాకు మంత్రి పదవి ఇవ్వాలా? వద్దా అంటూ జరుగుతున్న సర్వేలో ఆయనకు వ్యతిరేకంగా ఫలితం వస్తోందని వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది. తద్వారా ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం లేదని బల్లగుద్ది మరీ చెబుతున్నట్టు నమాచారం. సర్వేను కాదని తమ అధినేత ముందుకు వెళ్లడనే ధీమా వ్యతిరేక వర్గంలో కనిపిస్తోందని అధికారపార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. సర్వే అంటే జనాభిప్రాయమని.. ఇందుకు భిన్నంగా పదవి కట్టబెట్టే ప్రసక్తే లేదని గాంభీర్యంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద అధికారపార్టీలో ఇరువర్గాల మధ్య రేగిన విభేదాల పర్వం విరామం లేకుండా కొనసాగుతూనే ఉంది.