సాక్షి, కడప: ‘మైదుకూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన నిహారిక(7) అనే చిన్నారికి తీవ్ర జ్వరం సోకింది. చికిత్స కోసం వారి తల్లిదండ్రులు కడప నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. రక్తంలో తెల్లకణాలు భారీగా తగ్గి 39వేలు మాత్రమే ఉన్నట్లు ల్యాబ్ రిపోర్టు ఇచ్చారు. హైదరాబాద్‌కు సిఫార్సు చేశారు. అయితే కర్నూలుకు తీసుకెళ్లినా మంచి వైద్యం అందుతుందని ఓ వ్యక్తి సలహా ఇచ్చారు. దీంతో కర్నూలులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు చేయిస్తే రక్తకణాలు సాధారణ స్థితిలో ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. ఈ సమయంలో తల్లిదండ్రులు ఎంత తల్లడిల్లి ఉంటారు.డెంగీ పేరుతో చికిత్స చేసి ఉంటే ఎంత నష్టపోయేవారు.
డెంగీ పేరిట జిల్లాలో నిర్వహిస్తున్న పరీక్షలు రోగుల్ని కలవరపెడుతున్నాయి. ప్లేట్‌లెట్ల సంఖ్య క్షణక్షణానికీ వేల సంఖ్యలో మార్పు వస్తుండటంతో ఏ ల్యాబ్ రిపోర్ట్ సరియైనదో తెలీక రోగులు ఆందోళన పడుతున్నారు. ఇక పరీక్షల పేరుతో వేలకు వేల రూపాయలు ల్యాబ్‌ల్లో లాగుతున్నారు. సర్కారు ఆస్పత్రుల్లో నాణ్యమైన చికిత్స అందక తప్పని పరిస్థితుల్లో రోగులు ప్రైవేటు బాట పట్టాల్సి రావడం, అక్కడికి వెళితే తప్పుడు రిపోర్టులు...అధిక ఫీజులతో రోగులు బెంబేలెత్తిపోతున్నారు.
ప్రభుత్వ గుర్తింపు సర్టిఫికెట్లు ఎక్కడ?:
జిల్లాలో చాలా ప్రైవేటు ఆస్పత్రులలో అక్కడే ల్యాబ్ సౌకర్యం అందుబాటులో ఉంది. అయితే చాలా వాటికి వైద్య, ఆరోగ్యశాఖ గుర్తింపు లేదు. ప్రభుత్వ గుర్తింపు సర్టిఫికెట్ లేకుండానే ల్యాబ్‌లను నడుపుతున్నారు. నిపుణులైన టెక్నీషియన్లు లేరు. ఎంఎల్‌టీ చేసిన ఓ వ్యక్తి పేరుతో అనుమతి తెచ్చుకుని అరకొర పరీక్షలు చేయడం వచ్చిన ‘ల్యాబ్‌బాయ్స్’తో కూడా పరీక్షలు చేయిస్తున్నారు. దీంతోనే తప్పుడు రిపోర్టులు వస్తున్నాయి. ఈ పరిస్థితి తరచూ ఎదురవుతున్నా వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు తీసుకోవడం లేదు. ల్యాబ్‌లపై తనిఖీలు చేపట్టడం, అనుమతులు లేనివాటిని సీజ్ చేయడం జరగడం లేదు. దీనికి కారణం ల్యాబ్ ఏర్పాటు సమయంలో అధికారులకు మామూళ్లు ఇచ్చుకోవడం, ఆపై ప్రతి నెలా పంపకాలు సాగుతుండటంతో వీటిపై చర్యలు కొరవడ్డాయి. అలాగే జిల్లాలోని కొంతమంది ప్రైవేటు వైద్యులు కూడా కాసులకు ఆశపడి ఎక్కువ కమీషన్ ఇచ్చే ల్యాబ్‌లకు రిపోర్టులు రాసిస్తున్నారు. దీంతోనే సమస్య ఉత్పన్నమవుతోంది.
పెద్ద ఆస్పత్రుల నుంచి పెద్ద కమీషన్లు:
డెంగీ, విష జ్వరాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా...అధికారుల్లో అప్రమత్తత కొరవడింది. ప్రజల ప్రాణాల మీద కొచ్చినప్పుడు ఓ వైద్యశిబిరం ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో సర్కారు వైద్యంపై సామాన్యుడికి భరోసా కరువైంది. ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో జిల్లాలో మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి విషజ్వరాలు ముసురుకుంటున్నాయి. ఇదే అదనుగా ప్రైవేటు వైద్యులు జ్వరం, ఒళ్లునొప్పులనగానే డెంగీ లక్షణాలంటూ భయపెడుతున్నారు. ఇక్కడ పరీక్షల నిమిత్తం 600-1000రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. అలాగే ఖర్చు ఎంతయినా ఫర్వాలేదనే వారిని రాజధాని ఆస్పత్రులకు తరలిస్తూ, వారి నుంచి దండిగా కమీషన్లు దండుకుంటున్నారని తెలుస్తోంది.
పరీక్షలు ఇలా..!
చికున్‌గున్యా, మలేరియా జ్వర లక్షణాలున్న వారికి ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోతుంది. డెంగీ బారిన పడిన వారికి ఇవి మరింత తగ్గుతాయి. ప్లేట్‌లెట్ల సంఖ్య 20వేల కన్నా తక్కువగా ఉండి, రక్తస్రావ లక్షణాలు కనిపిస్తే తక్షణం ఉపశమన చర్యలు చేపట్టాలి. రక్తస్రావం లేకున్నా 10వేల కంటే ఎక్కువ పడిపోతున్నా ప్లేట్‌లెట్ల అవసరాన్ని గుర్తించాలి. ముఖ్యంగా రక్తంలో ప్లాస్మా తగ్గుతుందేమో పరీక్షించుకోవాలి. డెంగీ జ్వరాల్లో రక్తంలోని ప్లాస్మా బయటకు లీక్ అవుతుంది. ఇది ప్రమాదకరం. ప్లాస్మా లీకవడం వల్ల రక్తం చిక్కబడుతుంది..బీపీ కూడా తగ్గుతుంది. దీంతో పాటు రక్తకణాలు లక్షకన్నా తగ్గి ప్యాక్‌డ్‌సెల్‌వాల్యూమ్(పీసీవీ) ఉండాల్సిన దానికంటే 20శాతం పెరిగితే రక్తస్రావం లేకున్నా డెంగీగా భావించాల్సి ఉంటుంది.
వెయ్యి రూపాయల వరకూ వసూళ్లు:
ప్రస్తుతం జిల్లాలో కొన్ని రక్తపరీక్ష కేంద్రాల్లో ర్యాపిడ్‌కిట్ సాయంతో డెంగీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జాతీయ వైరాలజీ సంస్థ మార్గదర్శకాల ప్రకారం...ఎలీసా పరీక్షలో నిర్దారణ అయితేనే డెంగీగా పరిగణించాలి. ఇది కేవలం జిల్లాలో రిమ్స్‌తో పాటు మరో ప్రముఖ వైద్యశాలలో ఉంది. అయితే కొందరు ప్రైవేటు కేంద్రాల నిర్వాహకులు వైద్యులు కనుసన్నల్లో ప్రత్యేక కిట్ల ద్వారా నామమాత్రపు పరీక్షలు చేస్తున్నారు. ఇందుకు 200 వసూలు చేయాల్సి వెయ్యి రూపాయల వరకూ గుంజుతున్నారు. రిమ్స్‌లో ప్లేట్‌లెట్ కౌంటింగ్ మిషన్ ఉంది. అయితే అక్కడ రక్తపరీక్షలకు వినియోగించే కెమికల్స్ అయిపోవడం, ల్యాబ్ సిబ్బంది అందుబాటులో ఉండకపోవడం, మిషన్లు చెడిపోతే సకాలంలో మరమ్మతులు చేయించడంలో అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించడంతో అక్కడ సమస్యలు తలెత్తుతున్నాయి.
డెంగీ లక్షణాలు ఇలా:
డెంగీ జ్వరం వల్ల తలనొప్పి, కంటి వెనుకనొప్పి, కండరాల నొప్పులతో శరీరంపై దద్దుర్లు కనిపిస్తాయి. ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోతుంటే ముక్కు, నోరు, చిగుళ్ల వెంట రక్తం రావడం, వాంతులు, మలం నల్లగా ఉండటం, నిద్రలేమి, శ్వాసలో ఇబ్బంది, పొత్తి కడుపునొప్పి, నాలుక తడారడం వంటి లక్షణాలు కన్పిస్తాయి.