సాక్షి, మచిలీపట్నం : మనం సాధారణంగా ఏ పెళ్లిలోనో కుటుంబ సభ్యులంతా కలవడం చూస్తుంటాం. ఏ జాతరలోనో అయినవాళ్లంతా ఒక్కటై సందడి చేస్తుండటం గమనిస్తుంటాం. సార్వత్రిక ఎన్నికల పుణ్యమా అని ప్రస్తుతం ఆ పరిస్థితి అన్నిచోట్ల కనిపిస్తోంది. జిల్లాలోని అనేక పల్లెల్లో ఎన్నికల్లో పోటీ చేసే వారి కుటుంబ సభ్యులు సందడి చేస్తున్నారు. ఎవరికి వారు తమ వారిని గెలిపించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇళ్లకెళ్లి పలకరిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు.
పోలింగ్‌కు సమయం తక్కువగా ఉండటం, తిరగాల్సిన మండలాలు, పల్లెలు ఎక్కువగా ఉండటంతో అభ్యర్థులు తమతో పాటు కుటుంబ సభ్యులనూ రంగంలోకి దించారు. వారు అభ్యర్థి తరఫున ప్రతినిధిగా వెళ్తూ క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. రోజుకో మార్గాన్ని ఎంచుకోవడం అందులో సమయానుకూలంగా పల్లెలను నిర్దేశించుకొని ఆ మేరకు ఓట్ల అభ్యర్థన చేస్తున్నారు.
ఎండలను సైతం లెక్కచేయకుండా కొన్నిచోట్ల తమ బిడ్డల గెలుపు కోసం తల్లిదండ్రులు, భార్యలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ పరిణామం మంచిదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సమాజంలో ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఇంటి వద్దకు వెళితే ప్రజలు పడుతున్న బాధలు, వారి జీవన విధానంపై అవగాహన వస్తుందని అంటున్నారు. ఇప్పటి వరకు ఉన్నత చదువులు, ఇతర దేశాల్లో ఉంటూ రాజకీయాలపై అవగాహన లేని వారు సైతం ప్రస్తుత ఎన్నికల ప్రచారం చేస్తుండటంతో రాజకీయాలపై కొద్దోగొప్పో అవగాహన వచ్చే అవకాశం ఉందని అభిప్రాయ పడుతున్నారు.
- బందరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, అసెంబ్లీ అభ్యర్థి పేర్ని నాని తనయులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రతి పల్లె తిరుగుతూ పార్టీ మేనిఫెస్టో, నవరత్నాల ద్వారా ప్రజలకు చేకూరే లాభం, వైఎస్సార్ సీపీ ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఇంటి గడప తడుతూ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర తరఫున ఆయన సతీమణి, జనసేన అభ్యర్థి తరఫున అతని కుమారుడు ప్రచారం చేస్తున్నారు.
- పెడన నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి జోగి రమేష్ కొడుకు రాజీవ్ సైతం ప్రచారం నిర్వహిస్తున్నారు. రాత్రిళ్లు మంతనాలు జరుపుతున్నారు. టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకునేలా చురుకైన పాత్రపోషిస్తున్నారు.
- అవనిగడ్డ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు తరఫున తనయుడు వికాస్, కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వెళుతున్నారు.
- వైఎస్సార్ సీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి పీవీపీ కుటుంబ సభ్యులు సైతం ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజల వద్దకు వెళ్తున్నారు. రోజంతా ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు
జిల్లాలో 16 అసెంబ్లీ, 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా.. అన్ని చోట్ల ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని పార్టీల అభ్యర్థులకు చెందిన కుటుంబ సభ్యులు ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో గ్రామాన్ని ఎంచుకొని క్షేత్రస్థాయి వరకు వెళ్తున్నారు.
ఉదయం 6 నుంచి ప్రచార పర్వం ప్రారంభిస్తున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 నుంచి 11 గంటల వరకు నిరాటంకంగా సాగిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ పరిస్థితి కాస్త తక్కువగా ఉన్నా.. ఈ సారి ఈ తంతు ఎక్కువైంది. త్వరలో జరగబోయే ఎన్నికలు అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారడంతో బంధువులను రంగంలోకి దింపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment