వైఎస్ విగ్రహాన్ని ఎందుకు కూల్చలేదు?
కదిరి, న్యూస్‌లైన్ : రాజీవ్‌గాంధీ విగ్రహం కూల్చిన వాళ్లు అక్కడే ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఎందుకు కూల్చలేదని జిల్లా ఎస్పీ శ్యాంసుందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం అనంతపురం జిల్లా కదిరిలో విలేకరులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో శాంతియుతంగా సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తుంటే ఓ రాజకీయ పార్టీ నాయకులనే టార్గెట్ చేసి, వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా.. ‘అలాంటిదేమీ లేదు.. అక్కడ రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలను ధ్వంసం చేసిన వారు అక్కడే ఉన్న వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేయలేదు.
దీన్నిబట్టి ఒక పార్టీకి చెందిన వారే ఇదంతా చేశారని ఎవరికైనా అనుమానం వస్తుంది.. దీనిపై మీరేమంటార’ంటూ ఎదురు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానమే కదా.. అందుకే సోనియా కుటుంబ సభ్యుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారనుకోవచ్చు కదా అని విలేకరులు సమాధానమిచ్చారు. ఎస్‌కే యూనివర్శిటీ వద్ద విధి నిర్వహణలో ఉన్న ఓ దినపత్రిక విలేకరి అశోక్‌కుమార్‌పై లాఠీచార్జ్ చేయడం ఎంతవరకు సమంజసం? అదీ మీరే స్వయంగా దాడికి దిగడం సబబేనా? అన్న ప్రశ్నలకు.. ‘ఆ విలేకరి ఎస్‌కే యూనివర్శిటీలో విద్యనభ్యసిస్తున్నాడు. ఆయన విలేకరి అనే విషయం మాకు తెలియదని వివరణ ఇచ్చారు.