ఎందుకీ అఘాయిత్యం? | Why this oversight? | Sakshi
Sakshi News home page

ఎందుకీ అఘాయిత్యం?

Published Fri, Jun 20 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 9:04 AM

ఎందుకీ అఘాయిత్యం?

ఎందుకీ అఘాయిత్యం?

  •     మైనర్ ప్రేమికుల ఆత్మహత్యాయత్నం
  •      అబ్బాయి మృతి, చావుబతుకుల్లో బాలిక
  • రావికమతం: అంతుబట్టని కారణంతో మైనారిటీ తీరని బాలుడు, బాలిక ఆత్మహత్యకు ప్రయత్నించారు. వారిలో బాలుడు మృతి చెందగా, బాలిక ప్రాణాపాయ స్థితిలో ఉంది. పి.పొన్నవోలు శివారు పెదకుముందానిపేట గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్ ప్రేమికులు బుధవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో ప్రియుడు మృతిచెందగా, బాలిక విశాఖలోని ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.  

    పెద్దలకు కనీసం తెలియని ఈ ప్రేమ వ్యవహారంపై ఎవ్వరేమన్నారో తెలియదుగానీ తనువులు చాలించాలనే కఠిన నిర్ణయం తీసుకుని వీరు కన్నవారికి కన్నీరు మిగిల్చారు. ఇంతకీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నదీ ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. గ్రామానికి చెందిన నరేంద్ర (17), సమీపంలోనే నివాసం ఉంటున్న కల్పన(14) కొంతకాలంగా ఇష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. కల్పన మేడివాడ హైస్కూల్‌లో ఏడో తరగతి పూర్తి చేసింది. నరేంద్ర గతంలో ఎనిమిది వరకూ చదివి ఖాళీగా ఉంటున్నాడు.

    బధవారం రాత్రి వీరిరువురూ కొత్తకోటలోని కల్పన తాతగారింటికి వచ్చారు. వారు ఇంటి వద్ద లేకపోవడంతో అక్కడికి సమీపంలోని హైస్కూల్ గ్రౌండ్‌కు వెళ్లారు. అప్పటికే కొని సిద్ధంగా ఉంచుకున్న గుళికలు మింగేశారు. కాసేపటికి గింజుకుంటూ వారి బంధువులకు ఫోన్‌ద్వారా సమాచారం అందించారు. దీంతో ఉభయుల బంధువులూ అక్కడికి చేరుకుని వెంటనే నర్సీపట్నం ఆస్పత్రికి తరలిస్తుండగా నరేంద్ర మార్గమధ్యంలోనే మృతి చెందాడు.

    కల్పన అపస్మారక స్థితికి చేరుకోవడంతో నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో ప్రథమ చికిత్సచేసి ఆపై విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతోంది. తహశీల్దార్ భాస్కరరావు ఆ గ్రామం వెళ్లి విచారించారు. వారిద్దరూ ఎపుడూ కలిసి ఉన్నట్లు కూడా చూడలేదని, ఎందుకు ఇలా చేశారో అర్థం కావడం లేదని అక్కడివారు తహశీల్దార్‌కు వివరించారు. కొత్తకోట ఎస్‌ఐ శిరీష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement