ఉజ్వల భవితకు చిరునామా ‘సిపెట్‌’  | Widespread employment in the field of plastics | Sakshi
Sakshi News home page

ఉజ్వల భవితకు చిరునామా ‘సిపెట్‌’ 

Published Sat, Jan 4 2020 4:59 AM | Last Updated on Sat, Jan 4 2020 4:59 AM

Widespread employment in the field of plastics - Sakshi

సిపెట్‌ క్యాంపస్‌

సాక్షి, అమరావతి బ్యూరో:  ప్లాస్టిక్‌.. దైనందిన జీవితంలో విడదీయలేని విధంగా పెనవేసుకుపోయిన పదార్థం. లోహయుగంలో ఇనుము మనిషి జీవనాన్ని నిర్దేశిస్తే, ఆధునిక యుగంలో ప్లాస్టిక్‌ మానవ మనుగడకు చుక్కానిలా మారింది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఈ రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతమవుతున్నాయి. ప్లాస్టిక్‌ రంగంలో ఏటా 18 శాతం వృద్ధి రేటు నమోదవుతుండటమే దీనికి నిదర్శనం. ఈ రంగంలోని విస్తృత ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా యువతకు శిక్షణ ఇవ్వడానికి విజయవాడ సమీపంలోని గన్నవరంలో ఉన్న ‘సిపెట్‌’ (సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ) సంస్థ కృషి చేస్తోంది. పదో తరగతి విద్యార్హత తోనే ఇందులో ప్రవేశం పొందవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ‘సిపెట్‌’ క్యాంపస్‌లో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ల్యాబ్, టూల్స్‌ విభాగం, 24 గంటలూ అందుబాటులో ఉండే అత్యాధునిక లైబ్రరీ ఉన్నాయి. నిష్ణాతులైన అధ్యాపకులతో ఇక్కడ శిక్షణ ఇస్తారు. దేశ విదేశాలకు చెందిన సంస్థలు క్యాంపస్‌ సెలక్షన్స్‌ ద్వారా విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తున్నాయి.   

నాణ్యమైన మానవ  వనరులు అందించడానికే.. 
‘సిపెట్‌’ సంస్థను 2015లో విజయవాడలో ప్రారంభించారు. ఈ సంస్థ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కెమికల్స్‌ అండ్‌ పెట్రోకెమికల్స్, కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పటైంది. ‘ఐఎస్‌ఓ 9001: 2008 క్యూఎంఎస్‌ సర్టిఫైడ్, ఎన్‌ఏబీఎల్‌ అండ్‌ ఎన్‌ఏబీసీబీ’ గుర్తింపు పొందింది. ఇటీవల విజయవాడ శివారు గన్నవరంలోని అధునాతన భవనంలోకి దీన్ని మార్చారు. ప్లాస్టిక్‌ సంబంధిత పరిశ్రమలకు నాణ్యమైన మానవ వనరులను అందించటమే సిపెట్‌ లక్ష్యం. దీనికి సంబంధించి రానున్న నాలుగేళ్లలో దాదాపు 25 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు సిపెట్‌ డైరెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ తెలిపారు.

ఐఎస్‌ఐ సర్టిఫికెట్‌కు సీపెట్‌ నివేదిక కీలకం
సిపెట్‌లో అత్యాధునిక వసతులతో టూల్‌ సెక్షన్‌ ఉంది. ఆర్‌ఎండీ మౌల్డ్‌ విభాగంలో ప్రత్యేకంగా డిఫెన్స్, ఈసీఐఎల్, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీల్లో ఉపయోగించే టూల్స్‌ని డిజైన్‌ చేస్తారు. ఎస్‌ఎస్‌ఐ విభాగం సూక్ష్మ, స్థూల, చిన్న, మధ్యతరహా పరిశ్రమలతోపాటు భారీ పరిశ్రమలకు సాంకేతిక సహాయం అందిస్తుంది. ఇక్కడ ఐఎస్‌ఓ నెం. 17025/ఆర్‌/ఐఇసీ ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన ల్యాబ్‌ ఉంది. పరిశ్రమల ఉత్పత్తులకు ఐఎస్‌ఐ మార్కు దక్కాలంటే ఈ ల్యాబ్‌లో పరీక్షలు జరిపి సిపెట్‌ ఇచ్చే నివేదికే కీలకం.  ప్లాస్టిక్‌ పైపులను పరీక్షించే జర్మనీకి చెందిన ఐపీటీ 100 బార్‌ కెపాసిటీ అత్యాధునిక సాంకేతిక పరికరం ఇక్కడ ఉంది. ఇది ఒకేసారి 60 పైపులను పరీక్షించి ప్లాస్టిక్‌లో నాణ్యతను నిర్ధారిస్తుంది. ప్రముఖ దేవస్థానాల్లో అందించే లడ్డూ కవర్లకు సిపెట్‌ పరీక్షలు నిర్వహించి నివేదికలు అందజేస్తుంది. దేశవ్యాప్తంగా 24 సీపెట్‌ కేంద్రాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నారు. విజయవాడలోనూ ప్లాస్టిక్‌ ప్రాసెసింగ్, ఇంజక్షన్‌ మౌల్డింగ్, ఎక్స్‌ట్రాషన్, టూల్‌ రూమ్‌ అండ్‌ డిజైనింగ్‌ విభాగాల్లో వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల తరఫున యువతకు శిక్షణ ఇస్తున్నారు. 

విదేశాల్లోనూ ఉపాధి.. 
ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులను దేశ, విదేశీ పరిశ్రమలు క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసుకుంటాయి. ప్లాస్టిక్‌ రంగంలో పెట్టుబడులు పెట్టే ఔత్సాహికులు సైతం శిక్షణ పొంది సొంత పరిశ్రమలను స్థాపించుకోవచ్చు. పీపీటీ కోర్సు చేసిన విద్యార్థులకు విదేశాల్లో కనీస వేతనం రూ. 90 వేల వరకు లభిస్తుంది. డీపీఎంటీ చేసినవారికి రూ. 50 వేల వరకు జీతం లభిస్తుంది. పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్థి సైతం ఆపరేటర్‌గా కనీసం రూ. 40 వేలు సంపాదించొచ్చు.  

ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలు పుష్కలం
సిపెట్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్‌ ప్రాసెసింగ్‌ టెస్టింగ్‌ చదువుతున్నాను. ఈ కోర్సుకు మంచి భవిష్యత్‌ ఉంది. గల్ఫ్‌ దేశాలతో పాటు చైనా, జపాన్, దుబాయ్, సౌత్‌ కొరియాలలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. 
– వికాసింగ్, ఉత్తరప్రదేశ్‌  

మౌల్డ్‌ శిక్షణతో అచ్చులు తయారీ
నేను డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్‌ మౌల్డ్‌ టెక్నాలజీ కోర్సు చేస్తున్నాను. పదో తరగతి తరువాత సాంకేతిక రంగం బాగుంటుందని చేరాను. కంప్యూటర్‌ న్యూమరికల్‌ కంట్రోల్‌ ద్వారా మిషన్‌కు డిజైన్‌ను పంపిస్తాము. క్యాడ్‌ క్యాప్‌ సాప్ట్‌వేర్‌ ద్వారా ఏ పార్టు కావాలంటే ఆ పార్టు డిజైన్‌ చేయటం వీలవుతుంది. మిషన్‌ ద్వారా అచ్చులను తయారు చేసే ప్రక్రియ ఇది. మార్కెట్‌లో ఈ కోర్సు చేసిన వారికి మంచి డిమాండ్‌ ఉంది. 
– బాలం హరీష్, వీర వాసరం, పశ్చిమగోదావరి 

బోధన బాగుంది.
డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్‌ టెక్నాలజీ కోర్సులో చేరాను. ఇక్కడ మాకు అర్థమయ్యే విధంగా అధ్యాపకులు భోధన చేస్తున్నారు. ల్యాబ్, లైబ్రరీలు బాగున్నాయి. ఉద్యోగాలు సాధనకు ఈ కోర్సు ఎంతో ఉపయోగపడుతుంది.   – పినిశెట్టి గగన్‌సాయిరాజ్, విశాఖపట్నం

ప్రతి ఒక్కరికీ ఉద్యోగం
సిపెట్‌లో లాంగ్‌టర్మ్‌ కోర్సులు విద్యార్థుల జీవితాలకు బాటలు వేస్తున్నాయి. పీజీ కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఉపాధి కచ్చితంగా లభిస్తోంది. రూ. 12–24 వేల జీతాలు చదువుల కాలంలోనే అందుకుంటున్నారు. అనంతరం ఎంఎన్‌సీ కంపెనీలు వారికి రెగ్యులర్‌ ఉద్యోగాలు ఇస్తున్నాయి. క్వాలిటీ ప్లాస్టిక్‌ను రూపొందించటం, స్కిల్, టెక్నికల్, అకడమిక్, రీసెర్చి విద్యను అందించటం లక్ష్యం. ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకునే పారిశ్రామిక వేత్తలకు సిపెట్‌ పూర్తి సహకారం 
అందిస్తుంది.  
– కిరణ్‌కుమార్, డైరెక్టర్‌ అండ్‌ హెడ్, సిపెట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement