
భర్తను కడతేర్చిన భార్య
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని చంపేసిందన్న బంధువులు
పోలీసుల అదుపులో మృతుడి భార్య, అత్తామామలు
పీలేరు: మండలంలోని దేశిరెడ్డిగారిపల్లెలో ఓ వివాహిత తల్లిదండ్రులతో కలసి భర్తను హతమార్చింది. పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పీలేరు మండలం బాలంవారిపల్లె పంచాయతీ పరిధిలోని దే శిరెడ్డిగారిపల్లెకు చెంది వీరయ్య, సరస్వతమ్మల ఏకైక కుమార్తె సుజాతను 17 ఏళ్ల కిందట ఎర్రావారిపాళ్యం మండలం వీఆర్ అగ్రహారానికి చెందిన రామకృష్ణ కుమారుడు మోహన్‌రావ్‌తో వివాహం జరిగింది. సుజాత ఒక్కటే సంతానం కావడంతో ఇల్లరికం వచ్చేశాడు. ఆటో నడపడం, కూలే జీవనాధారంగా కుటుంబాన్ని పోషించేవాడు. వీరి కుమార్తె మౌనిక తొమ్మిదో తరగతి, కుమారుడు మధుసూదన్ ఏడో తరగతి చదువుతున్నారు. మృతుడు మద్యానికి బానిస కావడంతో తరచూ ఇంటిలో గొడవలు జరిగేవి. ఏడాది కిందట మోహన్‌రావ్‌పై భార్య సుజాత పీలేరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కొంత కాలం జైలుకు వెళ్లి వచ్చాడు.
నూతన సంవత్సరం కావడంతో గురువారం పిల్లలను ఆటోలో తలకోనకు తీసుకుపోయి రాత్రి ఇంటికి వచ్చాడు. అప్పటికే మద్యం తాగిన మోహన్‌రావు మత్తుగా నిద్రపోయాడు. భార్య సుజాత, మామ వీరయ్య, ఇతర కుటుంబ సభ్యులు రోకలిబండతో తలపై కొట్టడంతో నిద్రలోనే మృతిచెందాడు. స్థానికులు శుక్రవారం తెల్లవారుజామున పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ టి.నరసింహులు, ఎస్‌ఐ సిద్ధతేజమూర్తి సిబ్బందితో దేశిరెడ్డిగారిపల్లెకు చేరుకున్నారు. స్థానికులు, బంధువులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని పథకం ప్రకారం భార్య, అత్తమామలు హత్య చేశారని మృతుడి అన్న సుధాకర్, వదిన పార్వతి, బంధువులు ఆరోపించారు. భార్య, అత్తమామలు మరో వ్యక్తితో కలసి నిద్రలో హత్యచేశారని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య సుజాత, మామ వీరయ్య, అత్త సరస్వతమ్మ, ఇద్దరు పిల్లలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పథకం ప్రకారం భార్య, మామే హత్య చేశారని పోలీసులు చెపుతున్నారు.